విరాట్ కోహ్లీకి అభినందనలు తెలిపిన బీసీసీఐ

15-01-2022 Sat 20:18
  • టెస్టు కెప్టెన్ గా తప్పుకున్న కోహ్లీ
  • భారత టెస్టు క్రికెట్లో విజయవంతమైన కెప్టెన్ అంటూ బీసీసీఐ ప్రశంస  
  • అద్భుత ప్రస్థానం అంటూ స్పందించిన జై షా
BCCI congratulates Virat Kohli
భారత టెస్టు క్రికెట్ జట్టు సారథిగా తప్పుకుంటున్నట్టు విరాట్ కోహ్లీ చేసిన ప్రకటనపై బీసీసీఐ స్పందించింది. తన విశిష్ట నాయకత్వ లక్షణాలతో టీమిండియాను ఉన్నతస్థాయికి తీసుకెళ్లాడని కొనియాడింది. తాజా నిర్ణయం పట్ల కోహ్లీకి అభినందనలు తెలుపుతున్నట్టు వెల్లడించింది. భారత జట్టుకు కోహ్లీ 68 టెస్టుల్లో నాయకత్వం వహించగా, 40 విజయాలతో అత్యుత్తమ భారత టెస్టు కెప్టెన్ గా నిలిచాడని బీసీసీఐ వివరించింది.

బీసీసీఐ కార్యదర్శి జై షా స్పందిస్తూ, కెప్టెన్ గా కోహ్లీది అద్భుత ప్రస్థానం అని పేర్కొన్నారు. తన సారథ్యంలో టీమిండియాను నిర్దాక్షిణ్యంగా విరుచుకుపడే పోరాటదళంగా మలిచాడని కితాబునిచ్చారు. సొంతగడ్డపైనా, విదేశాల్లోనూ భారత్ ను ప్రబలశక్తిగా తీర్చిదిద్దాడని అభినందించారు. కోహ్లీ నాయకత్వంలో ఆస్ట్రేలియా, ఇంగ్లండ్ దేశాల్లో సాధించిన విజయాలు ఎంతో ప్రత్యేకం అని జై షా తెలిపారు.