బైకుపై వెళుతున్న వ్యక్తి ప్రాణం తీసిన గాలిపటం మాంజా

15-01-2022 Sat 18:59
  • మంచిర్యాలలో ఘటన
  • భార్యతో కలిసి బైక్ పై వెళుతున్న వ్యక్తి
  • మార్గమధ్యంలో గొంతుకు చిక్కుకున్న మాంజా
  • గొంతును కోసేసిన మాంజా
Kite thread kills biker in Manchiryal
సంక్రాంతి సీజన్ లో గాలిపటాలు ఎగరవేయడం ఓ సరదా. అయితే, గాలిపటాలకు కట్టే మాంజా (గాజు ముక్కల పొడి అద్దిన దారం) చాలా ప్రమాదకరమైనదని పర్యావరణవేత్తలు చాలాకాలంగా హెచ్చరిస్తున్నారు. మాంజా చుట్టుకుని అనేక పక్షులు మృత్యువాత పడడం, కాళ్లు, రెక్కలు కోల్పోయిన ఘటనలు కోకొల్లలు. తాజాగా, తెలంగాణలో ఓ వ్యక్తి గాలిపటం మాంజా కారణంగా మృతి చెందాడు.

మంచిర్యాలలో ఈ ఘటన జరిగింది. భీమయ్య (36) అనే వ్యక్తి తన భార్యతో కలిసి బైక్ పై వెళుతుండగా గాలిపటం మాంజా గొంతుకు చిక్కుకుంది. ఆ మాంజా భీమయ్య గొంతును కోసేసింది. బైక్ పై వెళుతున్నందున గొంతు లోతుగా తెగడంతో మరణం సంభవించింది. ఈ ఘటనతో భీమయ్య కుటుంబంలో విషాద ఛాయలు అలముకున్నాయి.