అసెంబ్లీ ఎన్నికలు జరిగే రాష్ట్రాలలో సభలు, రోడ్ షోలు మరో వారం పాటు నిషేధం

15-01-2022 Sat 17:48
  • వచ్చే నెల నుంచి ఐదు రాష్ట్రాల ఎన్నికలు
  • ఇటీవల షెడ్యూల్ విడుదల
  • ఈ నెల 8 నుంచి 15 వరకు కరోనా నిషేధాజ్ఞలు
  • మరో వారం పొడిగించిన ఈసీ
  • ఈ నెల 22 వరకు సభలు, సమావేశాలపై ఆంక్షలు
EC extends ban on rallies and road shows in five states
పంజాబ్, ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్, మణిపూర్, గోవా రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలకు షెడ్యూల్ విడుదలవడం తెలిసిందే. అయితే, దేశంలో కరోనా విజృంభిస్తుండడంతో ఈ నెల 8 నుంచి 15 వరకు ర్యాలీలు, రోడ్ షోలకు అనుమతి లేదని ఎన్నికల సంఘం షెడ్యూల్ విడుదల సందర్భంగా ప్రకటించింది. తాజాగా ఈ నిషేధాన్ని మరింత పొడిగించింది.

అసెంబ్లీ ఎన్నికలు జరిగే ఐదు రాష్ట్రాల్లో మరో వారం పాటు సభలు, రోడ్ షోలు, పాదయాత్రలు, సైకిల్, బైక్ ర్యాలీలపై నిషేధం అమల్లో ఉంటుందని ఈసీ నేడు వెల్లడించింది. తాజా నిషేధాజ్ఞలు ఈ నెల 22 వరకు వర్తిస్తాయని తెలిపింది. ఇన్ డోర్ సభల్లో 300కి మించి పాల్గొనరాదని స్పష్టం చేసింది. సభలు, సమావేశాల్లో 50 శాతం సీటింగ్ కే అనుమతి ఉంటుందని పేర్కొంది.