అన్నదమ్ములను విడదీసి రాజకీయం చేయాలనే ఆలోచన సీఎం జగన్ కు లేదు: చిరంజీవి అంశంపై మంత్రి బాలినేని

15-01-2022 Sat 14:47
  • సినిమా టికెట్ల అంశంపై పవన్ తీవ్ర వ్యాఖ్యలు
  • సినిమా టికెట్ల అంశంపై సీఎం జగన్ తో చిరు భేటీ
  • వైసీపీ రాజ్యసభ టికెట్ అంటూ ప్రచారం
  • ప్రచారాన్ని ఖండించిన చిరంజీవి
  • చిరు టికెట్ల అంశంపైనే జగన్ ను కలిశారన్న బాలినేని
Balineni opines on Chiranjeevi meeting with CM Jagan
టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి మొన్న ఏపీ సీఎం జగన్ తో భేటీ కాగా, 'ఆయనకు వైసీపీ రాజ్యసభ టికెట్' అంటూ ప్రచారం జరిగింది. ఇది అసత్య ప్రచారం అంటూ చిరంజీవి కూడా ఖండించారు. తాజాగా ఏపీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి ఈ అంశంపై స్పందించారు.

చిత్ర పరిశ్రమ ఎదుర్కొంటున్న సమస్యలపైనే చిరంజీవి సీఎం జగన్ ను కలిశారని స్పష్టం చేశారు. అయితే ఈ విషయాన్ని రాజకీయం చేయాలని కొందరు ప్రయత్నిస్తున్నారని విమర్శించారు. అన్నదమ్ములను విడదీసి రాజకీయం చేయాలనే ఆలోచన సీఎం జగన్ కు లేదని ఉద్ఘాటించారు. సినిమా వాళ్ల కోసం ఆయన చేయగలిగినంత మంచి చేస్తారని అన్నారు.

ఆమధ్య 'రిపబ్లిక్' సినిమా ఈవెంట్ లో సినిమా టికెట్ల అంశంపై జనసేనాని పవన్ కల్యాణ్ తీవ్రస్థాయిలో స్పందిస్తూ ఏపీ ప్రభుత్వాన్ని విమర్శించడం తెలిసిందే. ఈ క్రమంలో పవన్ కు కౌంటర్ గా చిరంజీవికి వైసీపీ రాజ్యసభ టికెట్ ఆఫర్ చేశారంటూ కథనాలు వచ్చాయి. వాటిపై చిరంజీవి స్పందిస్తూ, తాను రాజకీయాలకు పూర్తిగా దూరంగా ఉన్నానని, తనకు ఎలాంటి ఆఫర్లు రావని స్పష్టం చేయడం తెలిసిందే.