Dubai: ఒకే రన్‌వే పైకి రెండు విమానాలు.. దుబాయ్‌లో హైదరాబాద్, బెంగళూరు విమానాలకు తప్పిన పెను ముప్పు

Major collision between two India bound flights averted in Dubai
  • ఈ నెల 9న దుబాయ్ అంతర్జాతీయ విమానాశ్రయంలో ఘటన
  • ఏటీసీ అప్రమత్తతతో తప్పిన పెను ప్రమాదం
  • రెండు విమానాల్లో వందలాదిమంది ప్రయాణికులు
  • విచారణ మొదలెట్టిన ఎయిర్ యాక్సిడెంట్ ఇన్వెస్టిగేషన్ సెక్టార్ 
దుబాయ్ నుంచి హైదరాబాద్, బెంగళూరు వెళ్లాల్సిన రెండు విమానాలు పెను ప్రమాదం నుంచి త్రుటిలో తప్పించుకున్నాయి. దీంతో ఆ రెండు విమానాల్లో ఉన్న వందలాదిమంది ప్రయాణికులు ఊపిరి పీల్చుకున్నారు. ఈ నెల 9న జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.

దుబాయ్ నుంచి హైదరాబాద్ కు వెళ్లాల్సిన ఎమిరేట్స్ విమానం ఈకే-524 టేకాఫ్‌కు సిద్ధమై రన్‌వే 30ఆర్ పైకి చేరుకుంది. అదే సమయంలో బెంగళూరు వెళ్లాల్సిన మరో విమానం కూడా అదే రన్‌వేపై టేకాఫ్‌ కోసం దూసుకొస్తుండడాన్ని పైలట్లు గుర్తించారు.

మరోవైపు, జరగబోయే ప్రమాదాన్ని గుర్తించి అప్రమత్తమైన ఏటీసీ అధికారులు హైదరాబాద్ వెళ్లే విమానం టేకాఫ్‌ను రద్దు చేసి ట్యాక్సీ బేలోకి వెళ్లాల్సిందిగా ఆదేశాలు జారీ చేశారు. ఫలితంగా అది బెంగళూరు విమానానికి 790 మీటర్ల దూరంలోకి వచ్చి పక్కకు తప్పుకుంది. లేదంటే పెను ప్రమాదం జరిగి ఉండేది.

 ఆ తర్వాత అదే రన్‌వే పైనుంచి బెంగళూరు విమానం టేకాఫ్ తీసుకోగా, ఆ తర్వాత కాసేపటికే హైదరాబాద్ విమానం బయలుదేరింది. నిజానికి రెండు విమానాల టేకాఫ్‌ మధ్య 5 నిమిషాల తేడా ఉండాలి. కానీ అవి రెండూ ఒకేసారి రన్‌వే పైకి రావడంతోనే ఈ ఘటన చోటుచేసుకుంది. దీనిపై యూఏఈకి చెందిన ది ఎయిర్ యాక్సిడెంట్ ఇన్వెస్టిగేషన్ సెక్టార్ విచారణ ప్రారంభించింది.
Dubai
Flights
Hyderabad
Bengaluru

More Telugu News