Malladi Chandrasekhara Shastri: ప్రముఖ ప్రవచనకర్త మల్లాది చంద్రశేఖరశాస్త్రి కన్నుమూత

  • హైదరాబాదులోని తన నివాసంలో కన్నుమూత
  • చంద్రశేఖరశాస్త్రి వయసు 96 సంవత్సరాలు
  • వృద్ధాప్య సమస్యలతో శివైక్యం
  • సంతాపం తెలిపిన వెంకయ్య, పవన్
Malladi Chandrasekhara Shastri dies of age related issues

తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) శాశ్వత ఆస్థాన పండితుడు, ప్రముఖ ప్రవచనకర్త మల్లాది చంద్రశేఖరశాస్త్రి కన్నుమూశారు. ఆయన వయసు 96 సంవత్సరాలు. హైదరాబాదులోని తన నివాసంలో వృద్ధాప్య సంబంధ సమస్యలతో నేడు అయన తుదిశ్వాస విడిచారు.

మల్లాది చంద్రశేఖరశాస్త్రి మరణం పట్ల భారత ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సంతాపం తెలియజేశారు. ప్రముఖ ఆధ్యాత్మికవేత్త మల్లాది చంద్రశేఖరశాస్త్రి పరమపదించడం విచారకరమని వెంకయ్యనాయుడు పేర్కొన్నారు. ఆధ్యాత్మిక జ్ఞానం, సామాజిక దృక్పథాల సమ్మేళనంగా ఆయన ప్రవచనాలు సాగాయని కొనియాడారు. ఆయన ఆత్మకు శాంతి కలగాలని, ఆయన కుటుంబ సభ్యులకు సానుభూతి తెలుపుకుంటున్నానని ట్వీట్ చేశారు.

పవన్ కల్యాణ్ స్పందిస్తూ, మల్లాది చంద్రశేఖరశాస్త్రి అస్తమించారు అనే విషయం ఎంతో బాధ కలిగించిందని తెలిపారు. ఉగాది రోజున పంచాంగ శ్రవణంలో శాస్త్రి గారు చెప్పే విశేషాలు ప్రతి తెలుగు వ్యక్తికి చిరపరిచితమేనని పవన్ వివరించారు. పురాణ, ఇతిహాస, వేద విశేషాలు ప్రతి ఒక్కరికీ అర్థమయ్యేలా, ఆధ్యాత్మిక చింతన పెంచేలా ఆయన ఉపన్యాసాలు సాగేవని తెలిపారు. చంద్రశేఖరశాస్త్రి ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుడ్ని ప్రార్థిస్తున్నానని పవన్ ఓ ప్రకటనలో పేర్కొన్నారు.

మల్లాది చంద్రశేఖరశాస్త్రి జన్మస్థలం గుంటూరు జిల్లా క్రోసూరు. ఆయన 1925 ఆగస్టు 28న జన్మించారు. ఆయన వేదాలను ఔపోసన పట్టిన మహా పండితుడు. అనేక గ్రంథాలను కూడా రచించారు.

More Telugu News