Raghu Rama Krishna Raju: నా హత్యకు కుట్ర జరుగుతోంది: రఘురామకృష్ణరాజు సంచలన ఆరోపణ

  • ఝార్ఖండ్ వ్యక్తులతో చంపడానికి ప్రయత్నిస్తున్నారని ఆరోపణ 
  • ప్రధాని మోదీకి లేఖ రాస్తానని స్పష్టీకరణ
  • చంద్రయ్యను దారుణంగా హత్య చేశారన్న రఘురామ
  • ఎవరైనా నచ్చకపోతే జగన్ తీసేస్తుంటారని వ్యాఖ్యలు
Raghurama alleges murder conspiracy brewing on him

వైసీపీ రెబల్ ఎంపీ రఘురామకృష్ణరాజు సంచలన వ్యాఖ్యలు చేశారు. తన హత్యకు కుట్ర జరుగుతోందని ఆరోపించారు. ఝార్ఖండ్ వ్యక్తులతో తనను చంపించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని తెలిపారు. అన్ని వివరాలతో ప్రధాని నరేంద్ర మోదీకి లేఖ రాస్తానని అన్నారు.

టీడీపీ కార్యకర్త చంద్రయ్య హత్యపైనా రఘురామ స్పందించారు. చంద్రయ్యను ఎంతో దారుణంగా హత్య చేశారని వ్యాఖ్యానించారు. వ్యవస్థ నచ్చకపోయినా, వ్యక్తి నచ్చకపోయినా సీఎం జగన్ తీసేస్తుంటారని పేర్కొన్నారు.

ఇక తమ ప్రభుత్వానికి, ఓ ఆంగ్ల పత్రికకు మంచి సంబంధాలు ఉన్నాయని అన్నారు. ఆ పత్రికలో చిరంజీవిని రాజ్యసభకు పంపుతున్నారంటూ కథనం వచ్చిందని వివరించారు. అయితే, రాజ్యసభ పదవి కోసం చిరంజీవి వైసీపీలో చేరతారని భావించడంలేదని అభిప్రాయపడ్డారు. పవన్ కల్యాణ్ వ్యక్తిగత ప్రతిష్ఠకు భంగం కలిగే పనిని చిరంజీవి చేయరని రఘురామ అన్నారు. అయినా, చిరంజీవి చెప్పకపోతే సీఎంకు సినిమా రంగ కష్టాలు తెలియవా? అని రఘురామ ప్రశ్నించారు. సినీ రంగానికి అన్యాయం చేస్తే న్యాయం చేయడానికి కోర్టులు ఉన్నాయని వ్యాఖ్యానించారు.

అటు, జగనన్న గోరుముద్ద పథకంపైనా రఘురాజు స్పందించారు. ఈ పథకం ఇకపై ఏపీలో కొనసాగబోదని అన్నారు. ఈ అంశంలో తన లేఖకు కేంద్రమంత్రి స్మృతి ఇరానీ స్పందించారని తెలిపారు. కేంద్ర నిధులతో రాష్ట్రంలో జగనన్న పథకాలు కొనసాగించలేరని రఘురామ స్పష్టం చేశారు. ఇతర మంత్రిత్వ శాఖలు కూడా కేంద్ర స్త్రీ శిశు సంక్షేమ శాఖ బాటలో కొనసాగే అవకాశం ఉందన్నారు.

సీఐడీ చీఫ్ సునీల్ కుమార్ గురించి తాను ఎలాంటి ప్రకటనలు చేయలేదని తెలిపారు. ప్రతిపక్ష నేతలను వేధించేందుకు, కేసులు పెట్టేందుకు పోలీసులను వినియోగిస్తున్నారని ఆరోపించారు.

ఇదిలావుంచితే, ఇటీవల రఘురామ సంక్రాంతి సందర్భంగా సొంత నియోజకవర్గం నరసాపురం రావాలని భావించారు. అయితే సీఐడీ నోటీసుల నేపథ్యంలో ఆ ప్రయత్నం విరమించుకున్నట్టు తెలుస్తోంది. అటు, ఎంపీ పదవికి రాజీనామా చేసి మళ్లీ ఎన్నికలకు వెళతానని రఘురామ చెబుతున్నారు.

More Telugu News