Roja: సీఎం జగన్ తో చిరంజీవి భేటీ కావడంపై రోజా స్పందన

Roja responds on Chiranjeevi meeting with AP CM Jagan
  • ఏపీ సీఎంతో మెగాస్టార్ భేటీ
  • సినిమా టికెట్ల అంశంపై చర్చ
  • చిరంజీవి చర్యను స్వాగతించిన రోజా
  • ఆ విధంగా చర్చలు జరిగితే ఫలితం ఉంటుందని వెల్లడి
  • రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తే ప్రయోజనం ఉండదని స్పష్టీకరణ
సినిమా టికెట్ల వ్యవహారాన్ని ఓ కొలిక్కి తెచ్చే క్రమంలో టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి ఏపీ సీఎం జగన్ తో భేటీ కావడం తెలిసిందే. ఈ సమావేశంపై వైసీపీ ఎమ్మెల్యే, సినీ నటి రోజా స్పందించారు. సంక్రాంతి సందర్భంగా ఆమె కడప, శెట్టిపాలెంలోని బంధువుల ఇంటికి విచ్చేశారు.

ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ, సీఎం జగన్ తో చిరంజీవి భేటీ కావడం శుభ పరిణామం అని పేర్కొన్నారు. చిరంజీవిలా ఎవరైనా సీఎంను కలిసి ఆ విధంగా తమ సమస్యలు వివరించాలని రోజా అభిప్రాయపడ్డారు. అంతేతప్ప రెచ్చగొట్టే ధోరణిలో మాట్లాడితే ఎవరికీ మేలు జరగదని అన్నారు. సినీ రంగం చెబుతున్న అంశాల్లో న్యాయం ఉందనిపిస్తే సీఎం జగన్ తప్పకుండా మంచి నిర్ణయం తీసుకుంటారని స్పష్టం చేశారు.

వాస్తవానికి సీఎం జగన్ కు ఎంతో బిజీ షెడ్యూల్ ఉంటుందని, ఆయన సినీ రంగం గురించి ఆలోచించాల్సిన అవసరంలేదని, అయినప్పటికీ మంచి చేయాలన్న ఉద్దేశంతోనే ముందుకెళుతున్నారని వివరించారు. అయితే ప్రతిపక్షాలు ప్రతి అంశంలోనూ రాద్ధాంతం చేస్తున్నాయని, ఇప్పుడు సినిమా టికెట్ల అంశాన్ని కూడా అదే దృష్టితో చూస్తున్నాయని రోజా విమర్శించారు. ప్రజలు సౌకర్యవంతంగా జీవించడం కోసమే సీఎం ఆలోచిస్తుంటారని తెలిపారు.
Roja
Chiranjeevi
CM Jagan
Cinema Tickets
YSRCP
Tollywood

More Telugu News