ఇదిగో.. ఇలా తార‌క్‌, చెర్రీలా మీరూ పోజు కొట్టండి అంటున్న 'ఆర్ఆర్ఆర్' టీమ్.. ఫ‌న్నీ మీమ్స్‌

14-01-2022 Fri 13:33
  • కొమరం భీమ్‌గా ఎన్టీఆర్, అల్లూరిగా రామ్ చరణ్
  • కొండ‌పై న‌డుస్తూ వెళ్తున్న‌ట్లు కొత్త ఫొటో
  • సినిమా విడుద‌ల చేయాలంటూ నెటిజ‌న్ల డిమాండ్
  • రియాక్ష‌న్ మామూలుగా లేదు
Pose like our RAM BHEEM with your dearest ones
దర్శకుడు రాజమౌళి రూపొందిస్తున్న మ‌ల్టీస్టార‌ర్ మూవీ 'ఆర్ఆర్ఆర్' నుంచి చెర్రీ, తార‌క్ కు సంబంధించిన ఓ ఫొటోను ఆ సినిమా బృందం పోస్ట్ చేసింది. ఈ సినిమాలో కొమరం భీమ్‌గా ఎన్టీఆర్, అల్లూరి సీతారామరాజుగా రామ్ చరణ్ న‌టిస్తోన్న విష‌యం తెలిసిందే. ఈ యంగ్‌ ఎన‌ర్జిటిక్ హీరోలు ఈ సినిమాలో హాయిగా కొండ‌పై న‌డుస్తూ వెళ్తున్న‌ట్లు ఈ కొత్త ఫొటోలో ఉంది.

తార‌క్ ఓ కర్ర ప‌ట్టుకుని వెళ్తుండ‌గా, ఆయ‌న ప‌క్క‌నే జేబులో చేతిని పెట్టుకుని చెర్రీ ఉన్నాడు. వీరిద్ద‌రూ న‌వ్వుతూ ఉన్న ఈ ఫొటో అల‌రిస్తోంది. ఈ ఫొటోను పోస్ట్ చేసిన ఆర్ఆర్ఆర్ టీమ్ ప్రేక్ష‌కుల‌కు భోగి, సంక్రాంతి, క‌నుమ శుభాకాంక్ష‌లు తెలిపింది. అంతేకాదు.. అభిమానుల‌కు ఓ సూచ‌న చేసింది.

అచ్చం ఈ ఫొటోలో ఉన్న‌ట్లు తార‌క్, చెర్రీల్లా త‌యారై ఫొటోలు పోస్ట్ చేయాల‌ని చెప్పింది. పండుగ వేళ మ‌న‌కు ఇష్ట‌మైన వారితో ఇలా ఫొటో తీసుకుని పోస్ట్ చేయాల‌ని కోరింది. కాగా, ఎన్టీఆర్, చరణ్ ఈ సినిమాలో న‌టిస్తుండ‌డం, బాహుబ‌లి వంటి భారీ హిట్ త‌ర్వాత రాజ‌మౌళి ఈ సినిమా చేస్తుండ‌డంతో ఈ సినిమాపై భారీ అంచ‌నాలు ఉన్నాయి.

ఇక ఈ సినిమా సంక్రాంతికి విడుద‌ల‌వుతుందని ఎదురుచూసిన ప్రేక్ష‌కులకు ఆ సినిమా యూనిట్ ఇటీవల నిరాశను మిగిల్చింది. దేశంలో కరోనా కేసుల్లో పెరుగుదల, ఒమిక్రాన్ కలకలం నేపథ్యంలో ఆర్ఆర్ఆర్ చిత్రాన్ని సంక్రాంతి ముందు విడుద‌ల చేయ‌లేమ‌ని ప్ర‌క‌టించిన విష‌యం తెలిసిందే. ఆర్ఆర్ఆర్ సినిమా విడుద‌లై ఉంటే పండుగ చేసుకునేవాళ్ల‌మ‌ని, ఇప్పుడు హీరోల్లా పోజులు ఇచ్చి ఫొటోలు పంప‌మంటున్నార‌ని నెటిజ‌న్లు కామెంట్లు, మీమ్స్ పోస్ట్ చేస్తూ రిప్లై ఇస్తున్నారు.