Bandi Sanjay: బండి సంజయ్ ఫిర్యాదుపై రంగంలోకి ప్రివిలేజ్ కమిటీ

  • ఉద్యోగులకు మద్దతుగా సంజయ్ జాగరణ దీక్ష
  • అరెస్ట్ చేసిన పోలీసులు
  • తనపై సీపీ దాడి చేశారన్న బండి సంజయ్
  • లోక్ సభ స్పీకర్ కు ఫిర్యాదు
Parliament Privilege Committee takes up Bandi Sanjay complaint

తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు, కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ ఇటీవల రాష్ట్ర ఉద్యోగులకు మద్దతుగా జాగరణ దీక్ష చేపట్టారు. అయితే కరీంనగర్ లో ఆయన దీక్షను భగ్నం చేసిన పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ సందర్భంగా నగర పోలీస్ కమిషనర్ తనతో దురుసుగా ప్రవర్తించారంటూ సంజయ్ లోక్ సభ స్పీకర్ ఓం బిర్లాకు ఫిర్యాదు చేశారు. దీనిపై పార్లమెంటు ప్రివిలేజ్ కమిటీ విచారణ షురూ చేసింది.

ఈ క్రమంలో వ్యక్తిగతంగా హాజరై వివరాలు ఇవ్వాలని బండి సంజయ్ ని ప్రివిలేజ్ కమిటీ ఆదేశించినట్టు తెలుస్తోంది. దీంతో ఈ నెల 21న ఆయన ఢిల్లీలో ప్రివిలేజ్ కమిటీ ముందు హాజరయ్యే అవకాశాలున్నాయి. ఆ తర్వాత పోలీస్ కమిషనర్ ను కూడా ప్రివిలేజ్ కమిటీ విచారించనుంది.

ఈ నెల మొదటివారంలో బండి సంజయ్ కరీంనగర్ లో దీక్ష చేపట్టగా, నగర పోలీస్ కమిషనర్ సత్యనారాయణ ఆధ్వర్యంలో పోలీసులు బీజేపీ కార్యాలయంపై దాడి చేశారంటూ కమలనాథులు ఆరోపిస్తున్నారు. కార్యాలయ గ్రిల్స్ తొలగించి సంజయ్ ని బలవంతంగా ఆఫీసు నుంచి వెలుపలికి తీసుకువచ్చి అరెస్ట్ చేశారన్నది బీజేపీ నేతల వాదన.

బండి సంజయ్ అరెస్ట్ నేపథ్యంలో జాతీయ స్థాయి బీజేపీ నేతలు టీఆర్ఎస్ సర్కారుపై తీవ్రస్థాయిలో మాటల యుద్ధానికి తెరదీశారు. మధ్యప్రదేశ్ సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్ హైదరాబాద్ వచ్చి మరీ ప్రెస్ మీట్ ఏర్పాటు చేశారు. ఇతర జాతీయ నేతలు కూడా నేరుగా సీఎం కేసీఆర్ ను టార్గెట్ చేసి విమర్శనాస్త్రాలు సంధించారు.

More Telugu News