corona: ఒమిక్రాన్ ను అందరికీ సోకనివ్వండి.. మహమ్మారి అంతానికి ఇదే మార్గం: భారత సంతతి వైద్య నిపుణుల సూచన

  • తీవ్రత తక్కువున్న రకాలను అనుమతించాలి
  • లేదంటే తదుపరి మరింత తీవ్రమైన రకం ఉద్భవిస్తుంది
  • మరింత వైరల్ లోడ్ తో వస్తుంది
  • అప్పుడు టీకాలు కూడా ఏమీ చేయలేవు
  • ఈ అభిప్రాయాలతో విభేదిస్తున్న కొందరు నిపుణులు
To end pandemic let milder strains spread

కరోనా మహమ్మారి అంతానికి ఒక ఆశ్చర్యకరమైన, అసాధారణమైన సూచనను ఇద్దరు భారత సంతతి వైద్య నిపుణులు సూచించారు. ఒమిక్రాన్ వేరియంట్ అందరికీ పాకుతుందని కొందరు నిపుణులు అంచనా వేస్తున్నారు. ఈ క్రమంలో అమెరికాలోని భారత సంతతి వైద్య నిపుణులు వివేక్ రామస్వామి, అపూర్వ రామస్వామి సూచనలు వాల్ స్ట్రీట్ జర్నల్ ఒపీనియన్స్ అండ్ రివ్యూస్ లో ప్రచురితమయ్యాయి. వీటి పట్ల ఇప్పుడు పెద్ద చర్చ నడుస్తోంది.

కరోనా ఒమిక్రాన్ ను వేగంగా అందరికీ పాకిపోనివ్వడం ఈ మహమ్మారిని అంతం చేయడానికి మెరుగైన మార్గమన్నది రామస్వామి దంపతుల సూచన. కానీ, ఇది నిప్పుతో చెలగాటమేనన్నది మరికొందరి అభిప్రాయంగా ఉంది. కానీ, రామస్వామి దంపతులు తమ సూచన వెనుక బలమైన నేపథ్యాన్ని వివరిస్తున్నారు.

‘‘ఒమిక్రాన్ వ్యాప్తిని తగ్గించేందుకు అనుసరిస్తున్న విధానాలతో.. మరింతగా ఇన్ఫెక్షన్ కలిగించే శక్తిమంతమైన వేరియంట్ ఏర్పడడానికి అవకాశం ఇచ్చినట్టు అవుతుంది. అది మరింత వైరల్ లోడ్ తో, టీకాల నిరోధకతను కలిగి ఉంటుంది. కనుక విధాన నిర్ణేతలు స్వల్ప లక్షణాలున్న ఒమిక్రాన్ తరహా రకాలు వేగంగా వ్యాప్తి చెందడాన్ని తప్పక సహించాలి.

మాస్కులు తప్పకుండా ధరించాలి, భౌతిక దూరం పాటించాలన్న నిబంధనకు స్వస్తి పలకాలి. లేదంటే ఈ నిబంధనలు వైరస్ వ్యాప్తిని నిదానింపజేయడమే కాదు.. మరింత నష్టానికి దారి తీస్తాయి’’ అని రామస్వామి దంపతులు ఒపీనియన్స్ అండ్ రివ్యూస్ లో ఆర్టికల్ రాశారు. వివేక్ రామస్వామి హెల్త్ కేర్ సంస్థ రోవియంట్ సైన్సెస్ ను స్థాపించి నిర్వహిస్తుంటే, అపూర్వ రామస్వామి ఓహియో స్టేట్ యూనివర్సిటీ మెడికల్ సెంటర్ అసిస్టెంట్ ప్రొఫెసర్ గా పనిచేస్తున్నారు.

కానీ, వీరి అభిప్రాయాలను కొందరు వైద్య నిపుణులే తోసిపుచ్చుతున్నారు. ఉద్దేశపూర్వకంగా ఒమిక్రాన్ ను పట్టుకుందామని ప్రయత్నిస్తే అది డైనమేట్ తో ఆటలాడుకున్నట్టే అవుతుందని హెచ్చరిస్తున్నారు. 

More Telugu News