Corona Virus: జీహెచ్ఎంసీ పరిధిలో మళ్లీ భయపెడుతున్న కరోనా.. మొత్తం కేసుల్లో సగం ఇక్కడే!

  • రాష్ట్రవ్యాప్తంగా 1,920 కేసుల నమోదు
  • కరోనాతో నిన్న ఇద్దరి మృతి.. 4,045కు పెరిగిన మరణాల సంఖ్య
  • చురుగ్గా సాగుతున్న వ్యాక్సినేషన్
Corona virus new cases raised in telangana

తెలంగాణలో కరోనా మహమ్మారి మళ్లీ తన ప్రతాపాన్ని చూపిస్తోంది. రాష్ట్రంలో నిన్న 1,920 కేసులు వెలుగు చూశాయి. పాజిటివిటీ రేటు 2.30 శాతానికి పెరిగింది. తాజా కేసులతో కలుపుకుని రాష్ట్రంలో నమోదైన మొత్తం కేసుల సంఖ్య 6,97,775కు చేరుకుంది. కరోనా బారినపడి నిన్న ఇద్దరు మరణించడంతో రాష్ట్రంలో ఇప్పటి వరకు మరణించిన వారి సంఖ్య 4,045కు పెరిగింది.

అలాగే రాష్ట్రవ్యాప్తంగా 417 మంది కరోనా నుంచి కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు. రికవరీ రేటు 97.05 శాతంగా రికార్డైంది. నిన్న నమోదైన కేసుల్లో సగానికిపైగా జీహెచ్ఎంసీ పరిధిలో నమోదు కావడం ఆందోళన కలిగిస్తోంది. ఇక్కడ 1,015 కేసులు వెలుగు చూడగా, మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాలో 209, రంగారెడ్డి జిల్లాలో 159, హనుమకొండ జిల్లాలో 55 కేసులు నమోదయ్యాయి. అత్యల్పంగా జయశంకర్ భూపాలపల్లి, రాజన్న సిరిసిల్ల జిల్లాలలో మూడేసి చొప్పున కొవిడ్-19 కేసులు నమోదయ్యాయి.

వ్యాక్సినేషన్ విషయానికొస్తే నిన్న రాష్ట్రవ్యాప్తంగా 2.76 లక్షల మందికి టీకాలు వేశారు. వీరిలో 90 వేల మంది తొలి డోసు తీసుకోగా, రెండో డోసు తీసుకున్న వారు 1.61 లక్షల మంది ఉన్నారు. 24,685 మంది బూస్టర్ డోసు తీసుకున్నారు. 15-18 ఏళ్ల లోపు టీనేజర్లలో ఇప్పటి వరకు 43 శాతం మందికి టీకాలు పంపిణీ చేశారు.

More Telugu News