Vijayashanti: ఈ జాబితాలో కొందరు ముఖ్యమంత్రులు కూడా ఉండడం ప్రజాస్వామ్యానికి అత్యంత హానికరం: విజయశాంతి

  • కిచిడీ కూటమి ఏర్పాటు చేస్తున్నారని వ్యాఖ్య  
  • మోదీని గద్దె దింపడమే వారి లక్ష్యమన్న విజయశాంతి
  • మోదీకి మద్దతు ఇవ్వాలని ప్రజలకు పిలుపు
Vijayasanthi slams Modi opponents

ప్రధాని నరేంద్ర మోదీపై దేశంలోని కొందరు అవినీతిపరులైన రాజకీయ నేతలు, 'నల్ల' ధనవంతులు, తీవ్రవాద గ్రూపులు, ఉగ్రవాదులు తదితర దేశద్రోహులు కడుపుమంటతో రగిలిపోతున్నారని తెలంగాణ బీజేపీ నేత విజయశాంతి పేర్కొన్నారు. ప్రధానిపై ద్వేషానికి కారణం ఏంటా అని విశ్లేషిస్తే, అవినీతి వ్యతిరేక విధానాలపై ఆయన తీసుకున్న ప్రతిష్ఠాత్మక నిర్ణయాలేనని అర్థమైందని వివరించారు.

ప్రధాని మోదీ డీ మానిటైజేషన్, బ్యాంక్ ఖాతాలను ఆధార్, పాన్ లతో లింకు చేయడం వంటి నిర్ణయాలతో పన్నుల వసూలు ప్రక్రియను కట్టుదిట్టం చేశారని విజయశాంతి తెలిపారు. ఆధార్ కార్డును రేషన్ కార్డులకు అనుసంధానించడం ద్వారా మహారాష్ట్రలో 10 లక్షల మంది నకిలీ నిరుపేదలు మటుమాయం అయ్యారని అన్నారు.

ఇదే తరహాలో ఆధార్ లింకప్ వల్ల 3 కోట్ల మంది నకిలీ గ్యాస్ ఖాతాదారులు, మదరసాల నుంచి స్కాలర్షిప్ లు పొందుతున్న 1.95 లక్షల మంది నకిలీ బాలబాలికల జాబితా కూడా ఎడారి ఎండమావిలా అదృశ్యమైందని పేర్కొన్నారు.

పాన్-ఆధార్ లింకుతో అక్రమ ఆస్తులు, బినామీ కింగులు, బ్రోకరేజ్ డీలర్లు అందరూ తీవ్ర అసహనంతో ఉన్నారని, తమ గుట్టు రట్టవుతుందని బెంబేలెత్తుతున్నారని వెల్లడించారు. పాన్-ఆధార్ లింకప్ వల్ల ఉగ్రవాదులకు నిధులు అందే మార్గాలను కూడా ప్రధాని మూసివేశారని తెలిపారు. అదేవిధంగా ఈ-టెండరు ప్రక్రియ ద్వారా చాలామంది కాంట్రాక్టర్ల పప్పులు ఉడకడంలేదని వివరించారు.

కాగా, ప్రాథమిక ఆదాయ నివేదికలకు పాన్, ఆధార్ అనుసంధానం చేయడం అనేది తమ ప్రాథమిక హక్కుల ఉల్లంఘన అని చాలామంది సుప్రీంకోర్టును ఆశ్రయించారని విజయశాంతి చెబుతూ.. ఈ జాబితాలో కొందరు ముఖ్యమంత్రులు కూడా ఉండడం ప్రజాస్వామ్యానికి అత్యంత హానికరం అని పేర్కొన్నారు.

ఈ వ్యతిరేకులందరూ మోదీని గద్దె దింపడం కోసం ఓ కిచిడీ కూటమిని ఏర్పాటు చేయడానికి చేతులు కలిపారని ఆరోపణలు చేశారు. మోదీ మళ్లీ అధికార పీఠం ఎక్కకుండా చేయడానికి వారు వెతకని దారంటూ లేదని విమర్శించారు.

ఇప్పుడు దేశంలో 1.25 బిలియన్ల మంది భారతీయులపై బాధ్యత పడిందని పేర్కొన్నారు. అవినీతిమయమైన కిచిడీ పార్టీలకు మద్దతు ఇవ్వాలా? అవినీతి అంతానికి కట్టుబడి ఉన్న ప్రధాని మోదీకి మద్దతు ఇవ్వాలా? అనేది నిర్ణయించడం ప్రజల చేతుల్లోనే ఉందని తెలిపారు.

  • Loading...

More Telugu News