Brahmos: సముద్రతల బ్రహ్మోస్ సూపర్ సోనిక్ మిస్సైల్ పరీక్ష విజయవంతం

  • భారత అమ్ములపొదిలో బ్రహ్మాస్త్రం 
  • పశ్చిమ తీరం నుంచి నావికాదళ వెర్షన్ ప్రయోగం
  • ఐఎన్ఎస్ విశాఖపట్నం నౌక నుంచి తాజా పరీక్ష
  • నిర్దేశిత నౌకను గురితప్పకుండా తాకిన బ్రహ్మోస్
Naval version Brahmos test fire successful

భారత్ అమ్ములపొదిలో బ్రహ్మాస్త్రం అనదగ్గ బ్రహ్మోస్ సూపర్ సోనిక్ క్రూయిజ్ మిస్సైల్ ను మరోసారి విజయవంతంగా పరీక్షించారు. తాజాగా పరీక్షించిన క్షిపణి సముద్రతల పోరాటానికి సంబంధించినది. సముద్రతలం నుంచి సముద్రతలంపైకి ప్రయోగించే వీలున్న ఈ బ్రహ్మోస్ సూపర్ సోనిక్ మిస్సైల్ ను పశ్చిమ తీరంలో ఐఎన్ఎస్ విశాఖపట్నం నౌక నుంచి ప్రయోగించారు. సముద్రంలో ఉన్న లక్షిత నౌకను ఈ క్షిపణి తుత్తునియలు చేసింది.

బ్రహ్మోస్ క్షిపణి నావికాదళ వెర్షన్ విజయవంతం కావడం పట్ల డీఆర్డీవో (డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్ మెంట్ ఆర్గనైజేషన్) శాస్త్రవేత్తలు హర్షం వ్యక్తం చేశారు.

బ్రహ్మోస్ సూపర్ సోనిక్ క్షిపణిని భారత, రష్యా శాస్త్రవేత్తలు సంయుక్తంగా అభివృద్ధి చేయడం తెలిసిందే. ప్రపంచంలో అత్యంత వేగవంతమైన మిసైళ్లలో ఇది కూడా ఒకటి. ఇందులో అత్యంత శక్తిమంతమైన రామ్ జెట్ మోటార్లు ఉంటాయి. బ్రహ్మోస్ విశిష్టత ఏంటంటే రాడార్లకు దొరకని రీతిలో భూమికి కేవలం 5 మీటర్ల ఎత్తులోనూ ప్రయాణించగలదు. గరిష్ఠంగా 15 వేల మీటర్ల ఎత్తులోనూ దూసుకెళ్లగలదు. 3.0 మాక్ స్పీడుతో ప్రయాణించే బ్రహ్మోస్ కు భూతల, గగనతల, సముద్రతల వెర్షన్ల డిజైన్ లో స్వల్ప మార్పులు చేశారు.

దీన్ని జలాంతర్గాముల నుంచి కూడా ప్రయోగించే వీలుంది. దీనికి సంప్రదాయిక లేదా అణు వార్ హెడ్ అనుసంధానం చేయొచ్చు. అణు వార్ హెడ్ తో బ్రహ్మోస్ సృష్టించే ఉత్పాతం అంచనాలకు అందనిదని రక్షణ రంగ నిపుణులు చెబుతుంటారు.

More Telugu News