Carbon Dioxide: నీటి అవసరం లేని వాషింగ్ మెషిన్.. అభివృద్ధి చేస్తున్న ఎల్జీ

  • కార్బన్ డయాక్సైడ్ వినియోగం
  • వాయు రూపం నుంచి ద్రవరూపంలో మార్పు
  • కొత్త టెక్నాలజీ అభివృద్ధి
  • దక్షిణ కొరియా వాణిజ్య శాఖ అనుమతి
LG Is Developing a Waterless Washing Machine

సంప్రదాయ వాషింగ్ మెషిన్లలో ఉన్న ఏకైక సమస్య.. అవి బోలెడంత నీటిని ఖర్చు చేస్తుంటాయి. దీంతో పట్టణాల్లో, నీటి కొరత ఉన్న ప్రాంతాల్లోని వారికి వీటితో సమస్యే. నీటిని అంతగా ఎందుకు ఖర్చు చేస్తాయంటే.. వస్త్రాలపై మురికి పోవాలంటే సర్ఫ్ లేదా లిక్విడ్ డిటర్జెంట్ ను వినియోగించాలి. ఈ సోప్ అంతటినీ వస్త్రాల నుంచి వదిలించాలంటే నీరే సాధనం. అంత నీటిని, సోప్ ను ఖర్చు చేయడం పర్యావరణానికి హాని చేయడమే అవుతుంది.

దీంతో ప్రత్యామ్నాయ పరిష్కారాలపై దక్షిణ కొరియాకు చెందిన ప్రముఖ ఎలక్ట్రానిక్ ఉత్పత్తుల సంస్థ ఎల్జీ దృష్టి సారించింది. నీటి అవసరం లేని వాషింగ్ మెషిన్ ప్రాజెక్టుపై పనిచేస్తోంది. దక్షిణ కొరియా వాణిజ్య శాఖ నూతన ఆవిష్కరణలను ప్రోత్సహించేందుకు శాండ్ బాక్స్ కార్యక్రమాన్ని ప్రకటించింది. ఇందులో భాగంగా ఎల్జీ కొత్త టెక్నాలజీని అభివృద్ధి చేసింది. నీటికి బదులు కార్బన్ డయాక్సైడ్ తో వస్త్రాలను వాష్ చేయడమే కొత్త విధానం. ఎల్జీ కొత్త టెక్నాలజీని పరీక్షించేందుకు దక్షిణ కొరియా వాణిజ్య శాఖ అనుమతి కూడా ఇచ్చింది.

కార్బన్ డయాక్సైడ్ ను వాయు రూపం నుంచి ద్రవరూపంలో మార్చుతుంది. ఆ ద్రవంతోనే వాషింగ్ మెషిన్ వస్త్రాలను శుభ్రం చేస్తుంది. దీంతో నీరు, డిటర్జెంట్ అవసరం ఉండదు. ఎటువంటి వాయువుల విడుదల కూడా ఉండదని ఎల్జీ చెబుతోంది. రెండేళ్లపాటు పరీక్షల తర్వాతే ఇది అందుబాటులోకి వస్తుందని అంచనా. 

More Telugu News