Nutrient rich foods: పిల్లల ఎదుగుదల చక్కగా ఉండాలంటే.. ఈ ఆహారానికి చోటు ఇవ్వాల్సిందే!

  • ప్రొటీన్లు, కార్బొహైడ్రేట్లు అవసరం
  • మంచి కొవ్వులు అందేలా చూడాలి
  • అయోడిన్ లోపం, రక్తహీనత ఉండకూడదు
  • అన్నీ అందితేనే సమగ్ర అభివృద్ధి
Nutrient rich foods to include in your kids diet

చిన్నారులు ఆరోగ్యంగా ఉండేందుకు, సమగ్రంగా ఎదిగేందుకు వారికి పోషకాలతో కూడిన ఆహారాన్ని ఇవ్వడం ఎంతో కీలకం. చాలా మంది తల్లిదండ్రులు శారీరక వృద్ధినే చూస్తుంటారు. మంచి బరువు, ఎత్తు పెరుగుతుంటే అంతా బాగుందని భావిస్తుంటారు.

కానీ, చిన్న వయసులో వారి మెదడు, నాడీమండల వ్యవస్థ చక్కగా వృద్ధి చెందితేనే సమగ్రాభివృద్ధిగా చూడాలి. అప్పుడు మరింత మంచి ఫలితాలను వారి నుంచి చూడొచ్చని నిపుణులు సూచిస్తున్నారు. కార్బొహైడ్రేట్లు, ప్రొటీన్లు, ఫ్యాట్, విటమిన్లు, మినరల్స్.. ఇవన్నీ పిల్లల ఆహారంలో భాగం చేయాలని ముంబైకి చెందిన చిన్న పిల్లల వైద్య నిపుణుడు డాక్టర్ సురేష్ బిరజ్దార్ సూచిస్తున్నారు.

ప్రొటీన్లు
పిల్లల ఎదుగుదల, అభివృద్ధికి ప్రొటీన్లు కీలకం. ఇన్ఫెక్షన్ పై పోరాడేందుకు యాంటీబాడీలకు ప్రొటీన్ అవసరం అవుతుంది. ప్రొటీన్ల రూపంలో వచ్చే అమైనోయాసిడ్స్ టిష్యూల మరమ్మతులకు సాయపడతాయి. మొక్కలు, జంతు ఉత్పత్తుల ద్వారా ప్రొటీన్లు లభిస్తాయి. గుడ్లు, చికెన్, చేపలు, తృణ ధాన్యాలు, పాల ఉత్పత్తుల్లో ప్రొటీన్ లభిస్తుంది.

ఫ్యాట్స్
మెదడు అభివృద్ధికి ఫ్యాట్స్ (కొవ్వులు) అవసరం. ఈ కొవ్వుల్లోనూ పలు రకాలు ఉన్నాయి. పాలీ అన్ శాచురేటెడ్ ఫ్యాటీ యాసిడ్స్, మోనో అన్ శాచురేటెడ్ ఫ్యాటీ యాసిడ్స్ మంచివి. శాచురేటెడ్, ట్రాన్స్ ఫ్యాటీ యాసిడ్స్ తో హాని ఉంటుంది. సోయా ఆయిల్, ఆలీవ్ ఆయిల్, సన్ ఫ్లవర్ ఆయిల్ రూపంలో మంచి కొవ్వులు లభిస్తాయి. అలాగే ఫిష్ ఆయిల్ కూడా.

ఐరన్
హెమోగ్లోబిన్ తగినంత ఉండేలా చూస్తుంది. ఇది లోపిస్తే అనీమియా (రక్తహీనత) సమస్య ఏర్పడుతుంది. ఇది జ్ఞాపకశక్తిపై ప్రభావం చూపిస్తుంది. నట్స్, కిస్ మిస్ లు, పాలకూర, గోంగూర, తోటకూర తదితర ఆకుకూరల్లో ఐరన్ పుష్కలంగా ఉంటుంది.

ఐయోడిన్
మెదడు ఎదుగుదలకు ఇది కూడా కీలకమైన మూలకం. అందుకే ఉప్పులో అయోడిన్ కలిపి విక్రయించడాన్ని తప్పనిసరి చేసింది కేంద్ర సర్కారు. పాల ఉత్పత్తుల్లో కొద్ది మోతాదులో ఉంటుంది. సముద్రపు ఉత్పత్తుల్లోనూ లభిస్తుంది.

ఫోలిక్ యాసిడ్, బి విటమిన్లు
శరీరంలోని ఎన్నో జీవక్రియలకు బి విటమిన్ల అవసరం ఏర్పడుతుంది. పిల్లల సమగ్ర ఎదుగుదలకు ఇవి సాయపడతాయి. ఫోలిక్ యాసిడ్ ను శిశువు గర్భంలో ఉన్నప్పటి నుంచి తల్లికి వాడిస్తుంటారు. లోపల పిల్లల మెదడు ఎదుగుదల చక్కగా ఉండాలనే దీని వెనుక ఉద్దేశ్యం. తాజా పండ్లు, ఆకుకూరలు, కూరగాయలు, పాలు, ముడి ధాన్యాలు, గుడ్లు, చికెన్ లో ఇవి లభిస్తాయి.

More Telugu News