Hospitals: హైదరాబాద్ ఆసుపత్రుల్లో పెరుగుతున్న చిన్నారుల చేరిక!

  • రోజుకు నాలుగైదు అడ్మిషన్లు
  • మూడు నెలల్లోపు శిశువులకు ఆక్సిజన్
  • ఓపీ, ఆన్ లైన్ ద్వారా కన్సల్టేషన్లు
  • సొంత వైద్యం వద్దంటున్న నిపుణులు
Hyderabad City Hospitals Rise In Kids Admission

హైదరాబాద్ ఆసుపత్రుల్లో ఒమిక్రాన్ కారణంగా చిన్నారుల చేరిక మొదలైంది. పది రోజుల క్రితంతో పోలిస్తే పరిస్థితుల్లో మార్పు కనిపిస్తోంది. రోజూ ముగ్గురు నుంచి ఐదుగురు చిన్నారులు వచ్చి చేరుతున్నారు. మూడు నెలల్లోపు శిశువులకు ఆక్సిజన్ పెట్టాల్సి వస్తోంది. దీంతో రానున్న రోజుల్లో మరిన్ని కేసులు వస్తాయన్న ఆందోళన వ్యక్తమవుతోంది.

ప్రధానంగా కుటుంబ సభ్యుల ద్వారా చిన్నారులు కరోనా బారిన పడుతున్నారు. ఇలా వైరస్ బారిన పడుతున్న పిల్లల్లో ఎక్కువ మందికి స్వల్ప లక్షణాలే ఉంటున్నాయి. రెండు రోజుల పాటు స్వల్ప స్థాయి జ్వరం కూడా కనిపిస్తోంది. కుటుంబ సభ్యులకు అనారోగ్యం రావడంతో చిన్నారులకూ పరీక్షలు నిర్వహిస్తున్నారు. దీంతో వీరిలోనూ కేసులు బయటపడుతున్నాయి.

మరోపక్క, నీలోఫర్ ఆసుపత్రిలో కేసుల పెరుగుదల కనిపిస్తోంది. జలుబు, దగ్గు, జ్వరం ఒక్కసారిగా వస్తున్నాయని నీలోఫర్ వైద్యులు చెబుతున్నారు. ‘‘ఫ్లూ, కోవిడ్  మధ్య తేడాలను గుర్తించడం కష్టం. చాలా మంది పిల్లల తల్లిదండ్రులు కరోనా టీకాలను తీసుకున్నవారే. వీరికి కరోనా సోకినా లక్షణాలు పెద్దగా కనిపించడంలేదు. అయితే, వీరి నుంచి పిల్లలకు కరోనా సోకుతున్నట్టు తెలుస్తోంది’’ అని ఓ వైద్యుడు పేర్కొన్నారు.

‘‘గత కొన్ని రోజులుగా కేసులు పెరగడం చూస్తున్నాం. ఎక్కువ శాతం అవుట్ పేషెంట్, ఆన్ లైన్ కన్సల్టేషన్ల ద్వారా సంప్రదిస్తున్నారు. గత నాలుగు రోజుల నుంచి రోజుకు నాలుగైదు అడ్మిషన్లు కూడా కనిపిస్తున్నాయి’’ అని లిటిల్ స్టార్స్ చిల్డ్రన్స్ హాస్పిటల్ డాక్టర్ సతీష్ ఘంటా తెలిపారు.

సొంత వైద్యం వద్దు
సొంతంగా ఇంట్లోనే పిల్లలకు కరోనా పరీక్ష చేయించి, చికిత్స తీసుకోవద్దని వైద్యులు సూచిస్తున్నారు. ‘‘పిల్లల వైద్యుడి సూచనలు తీసుకోవాలి. పరీక్ష చేసి నిర్ధారించుకోకపోతే జలుబు, దగ్గు, జ్వరాన్ని కరోనా లక్షణాలుగానే చూడాలి’’ అని అపోలో చిన్న పిల్లల వైద్య నిపుణుడు డాక్టర్ బీవీఎల్ నరసింహారావు పేర్కొన్నారు.

More Telugu News