Virat Kohli: మూడో టెస్టుకు నేను రెడీ: కోహ్లీ

Virat Kohli said he will play in third test
  • రేపటి నుంచి మూడో టెస్టు
  • 1-1తో సమంగా ఉన్న టీమిండియా, దక్షిణాఫ్రికా 
  • నిర్ణయాత్మకంగా మారిన మూడో టెస్టు
  • సిరాజ్ ఫిట్ గా లేడన్న కోహ్లీ
టీమిండియా సారథి విరాట్ కోహ్లీ దక్షిణాఫ్రికాతో మూడో టెస్టుకు సిద్ధమయ్యాడు. వెన్నునొప్పి కారణంగా రెండో టెస్టుకు దూరమైన కోహ్లీ ఇప్పుడు కోలుకున్నాడు. గత రెండ్రోజులుగా జట్టుతో పాటు సాధన చేస్తున్నాడు. ఇవాళ మీడియా సమావేశంలో మాట్లాడుతూ, తాను పూర్తి ఫిట్ నెస్ తో ఉన్నానని వెల్లడించాడు.

అయితే కండరాల నొప్పితో బాధపడుతున్న సిరాజ్ రేపటి మ్యాచ్ లో ఆడేది కష్టమేనని తెలిపాడు. సిరాజ్ ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నాడని, మూడో టెస్టుకు సిద్ధంగా ఉన్నాడని తాము భావించడంలేదని స్పష్టం చేశాడు. పూర్తి ఫిట్ నెస్ లేని ఆటగాడిని బరిలో దింపే సాహసం చేయరాదని, స్వల్ప ఇబ్బంది కాస్తా తీవ్ర గాయంగా మారే ప్రమాదం ఉంటుందని కోహ్లీ వివరించాడు.

అయితే, సిరాజ్ స్థానాన్ని ఎవరితో భర్తీ చేయాలన్నది ఇంకా నిర్ణయించలేదని, హెడ్ కోచ్, వైస్ కెప్టెన్ లతో కూర్చుని దీనిపై చర్చిస్తామని తెలిపాడు. రిజర్వ్ బెంచ్ బలంగా ఉండడంతో ఎవరిని ఎంపిక చేయాలన్నది కొంచెం కష్టమైన విషయమేనని చెప్పుకొచ్చాడు.

టీమిండియా, దక్షిణాఫ్రికా జట్ల మధ్య మూడు టెస్టుల సిరీస్ లో భాగంగా చివరి టెస్టు ఈ నెల 11 నుంచి కేప్ టౌన్ వేదికగా జరగనుంది. ఈ సిరీస్ లో తొలి టెస్టును టీమిండియా నెగ్గగా, రెండో టెస్టులో ఆతిథ్య దక్షిణాఫ్రికా గెలిచింది. దాంతో మూడో టెస్టు నిర్ణయాత్మకంగా మారనుంది.
Virat Kohli
Third Test
Fitness
Siraj
Cape Town
Team India
South Africa

More Telugu News