కొత్త హీరోను పరిచయం చేస్తున్న శ్రీకాంత్ అడ్డాల!

10-01-2022 Mon 10:59
  • కలిసిరాని 'బ్రహ్మోత్సవం'
  • గ్యాప్ తరువాత చేసిన 'నారప్ప'
  • త్వరలో కొత్త ప్రాజెక్టుతో సెట్స్ పైకి
Srkanth Addala New Project
శ్రీకాంత్ అడ్డాల 'కొత్త బంగారులోకం' సినిమాతో సృష్టించిన సంచలనం అంతా ఇంతా కాదు. ఆ తరువాత ఆయన లవ్ .. ఫ్యామిలీ ఎమోషన్స్ ను మిక్స్ చేస్తూ ముందుకు వెళ్లాడు. ఆ తరహా కథలు ఆయనకి బాగానే కలిసొచ్చాయి. అలా వచ్చిన  'సీతమ్మవాకిట్లో సిరిమల్లె చెట్టు' సినిమాకి విశేషమైన ఆదరణ లభించింది.

అయితే భారీ సంఖ్యలో ఆర్టిస్టులను తీసుకుని ఆయన చేసిన 'బ్రహ్మోత్సవం' ఆ స్థాయి నిరాశనే మిగిల్చింది. దాంతో మరో సినిమా చేతికి రావడానికి చాలా సమయమే పట్టింది. ఈ క్రమంలో తమిళ రీమేక్ గా ఆయన చేసిన 'నారప్ప'కి మంచి మార్కులు పడ్డాయి. దాంతో ఆయన తన తదుపరి సినిమాను కూడా స్టార్ హీరోతోనే చేయనున్నట్టుగా వార్తలు వచ్చాయి.

అయితే ఆయన ఒక కొత్త హీరోతో ఫిబ్రవరిలోగానీ .. మార్చిలోగాని సెట్స్ పైకి వెళుతున్నాడనేది తాజా సమాచారం. 'అఖండ' నిర్మాత మిర్యాల రవీందర్ రెడ్డి, తన బావమరిదిని హీరోగా పరిచయం చేయాలనుకుంటున్నాడట. ఆ ప్రాజెక్టును శ్రీకాంత్ అడ్డాలకి అప్పగించినట్టుగా ఒక టాక్ బలంగా వినిపిస్తోంది. ఈ సినిమాలో హీరోయిన్ గా కూడా కొత్త అమ్మాయినే తీసుకుంటున్నారట. ఇందులో వాస్తవమెంతన్నది చూడాలి.