రమేశ్ బాబు మరణంపై చిరంజీవి స్పందన.. పలువురు సినీ ప్రముఖుల సంతాపం

09-01-2022 Sun 12:03
  • మరణ వార్త విని షాకయ్యానన్న చిరంజీవి
  • తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యానన్న వెంకటేశ్
  • పుణ్యలోక ప్రాప్తి కలగాలన్న పరుచూరి గోపాలకృష్ణ
  • సాయి ధరంతేజ్, వరుణ్ తేజ్, నితిన్ సంతాపం
  • విచారం వ్యక్తం చేసిన పలువురు డైరెక్టర్లు
Cine Fraternity Pays Tribute To Ramesh Babu
రమేశ్ బాబు మృతి పట్ల సినీ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేశారు. అనారోగ్య కారణంతో నిన్న ఆయన హఠాన్మరణం చెందిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే పలువురు ప్రముఖులు ఆయనతో ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. ‘‘రమేశ్ బాబు మరణ వార్త విని షాకయ్యాను. ఆయన మరణ వార్త నన్ను తీవ్ర దిగ్ర్భాంతికి గురి చేసింది. మహేశ్ బాబుతో పాటు కుటుంబ సభ్యులందరికీ నా ప్రగాఢసానుభూతి తెలియజేస్తున్నా’’ అని చిరంజీవి ట్వీట్ చేశారు.  రమేశ్ బాబు మరణవార్త విని తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యానని వెంకటేశ్ ట్వీట్ చేశారు. మహేశ్ బాబు, ఆయన కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నానన్నారు.

‘‘సహృదయుడు ఘట్టమనేని రమేశ్ బాబు హఠాన్మరణం గుండెల్ని కలచివేసింది. ఆయన ఆత్మకు శాంతి చేకూరి, పుణ్యలోక ప్రాప్తి కలగాలని ప్రార్థిస్తూ కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నా’’ అని పరుచూరి గోపాలకృష్ణ అన్నారు. రమేశ్ బాబు మరణవార్త విని దిగ్భ్రాంతికి లోనయ్యానని సాయిధరమ్ తేజ్ ఆవేదన వ్యక్తం చేశారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తున్నానన్నారు. రమేశ్ కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. హీరోలు నితిన్, వరుణ్ తేజ్, దర్శకులు హరీశ్ శంకర్, గోపీచంద్ మలినేని, సంపత్ నంది తదితరులు విచారం వ్యక్తం చేశారు. రమేశ్ కుటుంబ సభ్యులకు సానుభూతి తెలియజేశారు.