మీరు ప్రేమించిన వారికి ఇలా చేయరు.. నాకు కూడా అలా చేయరని ఆశిస్తున్నా: జాక్వెలిన్

09-01-2022 Sun 10:03
  • నా వ్యక్తిగత అంశాలను ప్రచారం చేయవద్దు
  • మళ్లీ నన్ను చూస్తారు
  • ఈ దేశం నాకెంతో గౌరవం ఇచ్చింది
  • న్యాయం, మంచితనం నిలబడతాయి
Jacqueline Fernandez breaks silence on conman Sukesh case
నల్లధనం చలామణి, మోసం, దోపిడీ ఆరోపణలు ఎదుర్కొంటున్న సుఖేశ్ చంద్రశేఖర్ తో బాలీవుడ్ నటి జాక్వెలిన్ ఫెర్నాండెస్ సన్నిహితంగా ఉన్న ఫొటో తాజాగా నెట్టింట వెలుగు చూసింది. అందులో జాక్వెలిన్ కు కంటిపై సుఖేశ్ ముద్దిస్తున్నట్టుగా ఉంది. వీరిద్దరూ ఎంతగా ప్రేమలో మునిగిపోయారోనన్నది ఫొటో చూస్తే తెలుస్తుంది.  దీనిపై జాక్వెలిన్ తన ఇన్ స్టా గ్రామ్ వేదికగా స్పందించింది.

వీరిద్దరి సాన్నిహిత్యాన్ని చూపించే ఫొటోలు ఇప్పటికే ఎన్నో వెలుగు చూశాయి. కానీ, వాటి గురించి జాక్వెలిన్ ఎప్పుడూ స్పందించలేదు. మొదటిసారి ఆమె దీనిపై ఇన్ స్టా గ్రామ్ లో తన అభిప్రాయాలను పోస్ట్ చేసింది. చివర్లో కామెంట్లు పెట్టకుండా నియంత్రణ విధించింది.

‘‘ఈ దేశం, ప్రజలు నాకు అద్భుతమైన ప్రేమ, గౌరవం ఇచ్చారు. ఇలాంటి వారిలో నా స్నేహితులతోపాటు, మీడియా కూడా ఉంది. వారి నుంచి నేను ఎంతో నేర్చుకున్నాను. ప్రస్తుతం నేను గడ్డు పరిస్థితిని ఎదుర్కొంటున్నాను. అయితే, నా స్నేహతులు, అభిమానులు మళ్లీ నన్ను చూస్తారని ఖాయంగా చెప్పగలను.

నా ఏకాంతం, నా వ్యక్తిగత జీవితంలోకి ప్రక‌ృతి చొరబాటుకు సంబంధించిన చిత్రాలను వ్యాప్తి చేయవద్దని నా మీడియా మిత్రులను కోరుతున్నాను. మీరు మీ ప్రియమైన వారికి ఇలా చేయరు. అలాగే, నాకు కూడా చేయరని అనుకుంటున్నాను. న్యాయం, మంచితనం బలంగా నిలబడగలవని ఆశిస్తున్నాను. ధన్యవాదాలు’’అని చెబుతూ నమస్కారం ఎమోజీని పెట్టి లాగవుట్ అయ్యింది.