Ramesh Babu: మహేశ్ బాబు కుటుంబంలో తీవ్ర విషాదం... కృష్ణ పెద్దకుమారుడు రమేశ్ బాబు కన్నుమూత

  • కాలేయవ్యాధితో బాధపడుతున్న రమేశ్ బాబు
  • ఈ సాయంత్రం అస్వస్థతకు గురైన వైనం
  • ఆసుపత్రికి తరలిస్తుండగా మృతి
  • టాలీవుడ్ లో విషాద ఛాయలు
Mahesh Babu brother Ramesh Babu died

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేశ్ బాబు కుటుంబంలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. సూపర్ స్టార్ కృష్ణ పెద్దకుమారుడు రమేశ్ బాబు కన్నుమూశారు. రమేశ్ బాబు వయసు 56 సంవత్సరాలు. ఆయన కొంతకాలంగా కాలేయ వ్యాధితో బాధపడుతున్నారు. ఈ సాయంత్రం తీవ్ర అస్వస్థతకు లోనవడంతో రమేశ్ బాబును హుటాహుటీన ఆసుపత్రికి తరలించే ప్రయత్నం చేశారు. అయితే మార్గమధ్యంలోనే తుదిశ్వాస విడిచినట్టు తెలుస్తోంది.

రమేశ్ బాబు మృతితో టాలీవుడ్ లో విషాదఛాయలు అలముకున్నాయి. ఆయన మరణంతో పలువురు దిగ్భ్రాంతికి గురయ్యారు. ప్రస్తుతం రమేశ్ బాబు భౌతికకాయాన్ని హైదరాబాదులోని ఏఐజీ ఆసుపత్రిలో ఉంచారు. రేపు ఉదయం నివాసానికి తరలించనున్నారు. కాగా, మహేశ్ బాబు కరోనా సోకడంతో ఐసోలేషన్ లో ఉన్నారు.

రమేశ్ బాబు నటుడిగానే కాకుండా నిర్మాతగానూ పలు చిత్రాలు నిర్మించారు. ఆయన తొలి చిత్రం 'అల్లూరి సీతారామరాజు'. ఈ చిత్రం 1974లో వచ్చింది. తన తండ్రి కృష్ణ నటించిన చిత్రాల్లోనూ, ఆపై హీరోగానూ నటించారు. 90వ దశకం చివర్లో నటనకు స్వస్తి చెప్పిన ఆయన కొంతకాలం పరిశ్రమకు దూరమయ్యారు. 2004లో చిత్ర నిర్మాణ రంగంలో ప్రవేశించారు. మహేశ్ బాబు నటించిన 'అర్జున్', 'అతిథి' చిత్రాలు నిర్మించింది రమేశ్ బాబే. ఇక, మహేశ్ బాబు కెరీర్ లో భారీ హిట్ అనదగ్గ 'దూకుడు' చిత్రానికి ఆయన సమర్పకుడిగా వ్యవహరించారు.

More Telugu News