Bandaru Dattatreya: ఎన్టీఆర్ సీఎంగా ఉన్నప్పుడు తెలుగుజాతికి జాతీయస్థాయి గుర్తింపు: దత్తాత్రేయ

Haryana governor Dattatreya attends International Telugu Festival
  • పశ్చిమ గోదావరి జిల్లాలో అంతర్జాతీయ తెలుగు సంబరాలు
  • ముఖ్యఅతిథిగా వచ్చిన హర్యానా గవర్నర్ దత్తాత్రేయ
  • మాతృభాషను మర్చిపోరాదని హితవు
  • తాను ఇప్పటికీ తెలుగులోనే సంతకం చేస్తానని వెల్లడి

పశ్చిమ గోదావరి జిల్లా పెదఅమిరంలో అంతర్జాతీయ తెలుగు సంబరాలు ఘనంగా జరుగుతున్నాయి. ఇవాళ ముఖ్యఅతిథిగా హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, మాతృభాష విశిష్టతను ప్రస్తావించారు. మాతృభాషను ఎప్పటికీ మర్చిపోరాదని, తాను ఇప్పటికీ తెలుగులోనే సంతకం చేస్తానని దత్తాత్రేయ వెల్లడించారు. ఎన్టీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో తెలుగుజాతికి జాతీయస్థాయి గుర్తింపు లభించిందని అన్నారు. ప్రస్తుతం జరుగుతున్న తెలుగు సంబరాలు తెలుగువారి సంస్కృతిని ప్రతిబింబించేలా ఉన్నాయని కొనియాడారు.

కాగా, ఈ సంబరాల్లో విశాఖ శారదా పీఠాధిపతి స్వామి స్వరూపానందేంద్ర కూడా హాజరయ్యారు. ఆయన మాట్లాడుతూ, ఏ తరం అయినా తెలుగును చంపేయాలనుకుంటే, దాన్ని కాపాడేందుకు మరో తరం ఉవ్వెత్తున ఉద్భవిస్తుందని అన్నారు. తెలుగు భాషను తలదన్నే భాష మరొకటి లేదని ఆయన ఉద్ఘాటించారు.

హైదరాబాదులో శిల్పారామాన్ని మించిపోయేలా తెలుగు సంస్కృతి ఉట్టిపడే వేదికను ఏపీలోనూ నిర్మించాలని సీఎం జగన్ కు లేఖ రాస్తానని స్వరూపానందేంద్ర వెల్లడించారు. ఆంధ్ర సారస్వత పరిషత్ ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ సంబరాలకు ఏపీ మంత్రి శ్రీరంగనాథరాజు, అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ కోన రఘుపతి కూడా హాజరయ్యారు.

  • Loading...

More Telugu News