Vishnu Vardhan Reddy: వెంట‌నే ఈ చ‌ట్ట స‌వ‌ర‌ణ‌ను ఉపసంహ‌రించుకోవాలి: విష్ణువ‌ర్ధ‌న్ రెడ్డి

vishnu vardhan reddy slams jagan
  • వాగులు, వంకల్లో అధిక‌ ఇసుక నిల్వలు తవ్వుకునే అనుమతి
  • ఏపీలో పంచుతున్నారు, పిండుతున్నారు..
  • రాష్ట్రంలోని పేద ప్రజలను కనికరించండి
  • మీరు ఎలాగూ పేదవారికి ఇళ్లు కట్టిచ్చే పరిస్థితి లేదు
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లోని వాగులు, వంకల్లో అధిక‌ ఇసుక నిల్వలు ఉంటే వాణిజ్యపరంగా తవ్వుకునే అనుమతి ఇస్తూ నీరు, నేల, చెట్టు చట్టం (వాల్టా)ను ఏపీ ప్ర‌భుత్వం స‌వ‌రించింద‌ని ఓ దిన‌ప‌త్రిక‌లో వ‌చ్చిన వార్త‌ను పోస్ట్ చేస్తూ బీజేపీ నేత విష్ణు వ‌ర్ధ‌న్ రెడ్డి మండిప‌డ్డారు. ఇక‌పై వాగులు, వంకలు, ఏరుల్లో 5 వేల ఘనపు మీటర్ల కంటే ఎక్కువ ఇసుక నిల్వలు ఉంటే నిబంధనల ప్రకారం తవ్వి, అమ్ముకునేందుకు అనుమ‌తులు ఇచ్చార‌ని ఆ వార్త‌లో పేర్కొన్నారు. దీంతో 'పంచుతున్నారు, పిండుతున్నారు.. రాష్ట్రంలోని పేద ప్రజలను కనికరించండి జగన్ గారూ' అని విష్ణు వ‌ర్ధ‌న్ రెడ్డి పేర్కొన్నారు.

'ఒకవైపు సంక్షేమం పేరు చెప్పి మీరు డబ్బులు పంచుతున్నారు, ఇంకోవైపు ఆదాయం పేరు చెప్పి పేద ప్రజల నుండి రక్తాన్ని పిండుతున్నారు. మీరు ఎలాగూ పేదవారికి ఇళ్లు కట్టిచ్చే పరిస్థితి లేదు, కనీసం వాళ్ల‌ రెక్కల కష్టంతో కట్టుకుంటున్నా ప్రభుత్వం సహకరించకపోతే ఎలా?' అని ఆయ‌న నిల‌దీశారు.

'ఇప్పటికే ఒక వైపు పెరిగిన ఇసుక, సిమెంటు, ఐరన్, స్టీలు ధరలతో మధ్య తరగతి, పేదవారు సతమతమవుతుంటే ఇప్పుడు వాగులు, వంకల్లోని ఇసుకను కూడా అమ్ముకోవచ్చు అంటూ వాల్టా చట్టానికి సవరణ చేస్తూ పేదలకు అందుబాటులో ఉండే ఇసుకను సైతం రాష్ట్ర ప్రభుత్వం జయ ప్రకాశ్ వెంచర్సు కంపెనీకి దోచిపెట్టేలా నిర్ణయం తీసుకోవడాన్ని, అందుకు సంబంధించిన గెజిట్ నోట్ విడుదల చేయడాన్ని బీజేపీ తీవ్రంగా ఖండిస్తోంది' అని చెప్పారు. వెంటనే ఈ చట్ట సవరణను ఉపసంహరించుకోవాలని  డిమాండ్ చేశారు.
Vishnu Vardhan Reddy
BJP
YS Jagan

More Telugu News