UPSC: యూపీఎస్సీ మెయిన్స్ లో అభ్యర్థుల బుర్ర తినేసిన ‘ఫిలాసఫీ’ ప్రశ్నలు.. మంచి ట్రెండ్ అంటున్న నిపుణులు

  • నిన్న మొదలైన పరీక్షలు
  • ఎస్సే పేపర్ లో ప్రశ్నలన్నీ ఫిలాసఫీ మీదే
  • రెండు సెక్షన్లలో 8 ప్రశ్నలు
  • క్వశ్చన్ పేపర్ పై భిన్నాభిప్రాయాలు
  • బట్టీపట్టి చదివే వారికి కష్టమేనంటున్న నిపుణులు
Candidates Baffled With The UPSC Mains Essay Paper

‘నిజం హేతుబద్ధమైనది.. హేతుబద్ధత నిజమైనది’, ‘సాంకేతికత ఆధారిత పరిశోధన అంటే ఏంటి?’, ‘సంసారాన్ని చక్కదిద్దే చేతులే ప్రపంచాన్నీ ఏలుతాయి’.. ఇవీ నిన్న మొదలైన యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (యూపీఎస్సీ) మెయిన్స్ పరీక్షల్లో భాగంగా వ్యాసరచన ప్రశ్నపత్రంలో అడిగిన ఫిలాసఫీ (తత్వబోధన) ప్రశ్నలు.

ఇలా ఒకట్రెండు అడిగితే ఫర్వాలేదుగానీ.. ఒకేసారి 8 ప్రశ్నలడిగేసరికి ఆ ప్రశ్నపత్రం కాస్తా అభ్యర్థుల బుర్ర తినేసింది. ఏ, బీ రెండు సెక్షన్లలో నాలుగు చొప్పున తత్వ ప్రశ్నలను ఇచ్చారు. ఒక్కో సెక్షన్ నుంచి ఒక్క ప్రశ్నకు సమాధానం రాయాలని అడిగారు.

మామూలుగా అయితే గతంలో అంశాలవారీగా ప్రశ్నలు అడిగేవారు. కరెంట్ అఫైర్స్ మీద ప్రశ్నలిచ్చేవారు. ఇప్పుడు వాటి స్థానంలో బుర్రకు పదునెక్కించే తత్వ ప్రశ్నలివ్వడంతో అభ్యర్థులు షాకయ్యారు. ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్న ప్రస్తుత రాజకీయ, సామాజిక వ్యవహారాలపై ప్రశ్నలు అడుగుతారనుకుంటే.. ఇలా మొత్తం ఫిలాసఫీ ప్రశ్నలడిగేశారేంటో తెలియట్లేదంటూ ట్విట్టర్ వేదికగా చాలామంది ప్రశ్నిస్తున్నారు.

ఈ ప్రశ్నలపై భిన్నాభిప్రాయాలు వినిపిస్తున్నాయి. చెత్తపేపర్ అంటూ కొందరు అంటుంటే.. ఒకందుకు మంచిదేనని మరికొందరు అభ్యర్థులు అంటున్నారు. ‘‘ఛట్రం దాటి వచ్చి ఆలోచించేందుకు యూపీఎస్సీ ఔత్సాహికులు ప్రయత్నిస్తుంటే.. ఆ ఛట్రం మాత్రం విశ్వాన్ని దాటేసిపోయింది’’ అంటూ అపరాజిత అనే ఓ యూపీఎస్సీ అభ్యర్థి ట్వీట్ చేశారు. ఆ ప్రశ్నపత్రాన్ని దానికి జత చేశారు.

యూపీఎస్సీ ప్రశ్నపత్రం ర్యాండమ్ ప్రశ్నలతో గుడ్డిగా డేటింగ్ చేసినట్టుగానే ఉందంటూ గౌరీ రాయ్ అనే ఔత్సాహికురాలు అన్నారు. ఈసారి ప్రశ్నపత్రం చాలా కఠినంగా ఉందని, కరెంట్ అఫైర్స్ నుంచి కనీసం ఒకట్రెండు ప్రశ్నలైనా వస్తాయనుకున్నానని ఓ అభ్యర్థి చెప్పారు.

ప్రశ్నపత్రం పూర్తిగా తత్వ ప్రశ్నలతో నిండిపోయిందని, ఔత్సాహికుల వ్యక్తిత్వానికి ఇదే అసలైన పరీక్ష అంటూ శుభమ్ సింగ్ అనే మరో యూపీఎస్సీ యాస్పిరెంట్ ట్వీట్ చేశారు. పాత పద్ధతులను మార్చేందుకు యూపీఎస్సీ ప్రయత్నిస్తోందని, ఇప్పుడు బుక్కులో బట్టీ పట్టిన జ్ఞానం దేనికీ  పనికిరాదని వ్యాఖ్యానించారు. సొంత ఆలోచనలకు మరింత మెరుగులు అద్దేవారికే యూపీఎస్సీ జాబ్ వస్తుందని, బుక్కుల్లో, కోచింగ్ మెటీరియల్స్ లో చదివి యూపీఎస్సీ క్రాక్ చేయాలనుకునే వారికి జాబ్ రాదని అన్నారు.  


మంచిదేనంటున్న నిపుణులు

భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నా.. నిపుణులు మాత్రం ఇది మంచి ట్రెండేనని ప్రశంసిస్తున్నారు. గుంపులో గోవిందా అనే పద్ధతి నుంచి జనాల ధోరణిని మార్చేందుకు, మూస పద్ధతిలో వచ్చే ప్రశ్నలనే బట్టీ పట్టి చదివే అభ్యర్థులను సార్ట్ అవుట్ చేసేందుకు యూపీఎస్సీ మంచి ప్రశ్నపత్రాన్ని ఇచ్చిందని బెంగళూరులోని ఇన్ సైట్స్ ఐఏఎస్ అనే కోచింగ్ సంస్థ వ్యవస్థాపకుడు, డైరెక్టర్ వినయ్ కుమార్ జీబీ చెప్పారు. ఇది మంచి ట్రెండ్ అని అన్నారు. ఈ ట్రెండ్ మూడేళ్ల క్రితమే మొదలైందని, అయితే, ఈ ఏడాది సైబర్ సెక్యూరిటీ, ప్రజాస్వామ్యం, వ్యవసాయం వంటి అంశాల మీద ప్రశ్నలేవీ అడగలేదని చెప్పారు.

ఇలాంటి ప్రశ్నపత్రాలను క్రాక్ చేయాలంటే రాత్రికి రాత్రి కూర్చుంటే అయ్యేది కాదని, అభ్యర్థులు చదవడం, రాయడం వంటి అలవాట్లను అలవర్చుకోవాలని ఆయన సూచించారు. ఈ సారి ఎస్సే సెక్షన్ మార్కులు 10 వరకు తగ్గుతాయన్నారు. టాప్ మార్కులు 135 నుంచి 140 మధ్య వచ్చే అవకాశాలు ఉన్నాయని చెప్పారు.

అభ్యర్థుల జ్ఞానాన్ని, వ్యక్తిత్వాన్ని మరింత లోతుగా తెలుసుకునేలా ఈ ప్రశ్నపత్రం ఉందని సివిల్స్ డైలీ అనే కోచింగ్ సెంటర్ వ్యవస్థాపకుడు సాజల్ సింగ్ చెప్పారు. ఈ ప్రశ్నలకు సమాధానాలు రాయాలంటే ఆ ప్రశ్నల్లోని అసలు అంతరార్థాన్ని పసిగట్టాల్సి ఉంటుందని చెప్పారు. కాగా, నిన్న మొదలైన మెయిన్స్ పరీక్షలు 16 వరకు జరగనున్నాయి.

More Telugu News