raghava: రామ‌కృష్ణ‌ను బెదిరించిన‌ట్లు వనమా రాఘవ ఒప్పుకున్నాడు.. కేసు పూర్తి వివ‌రాలు చెప్పిన ఏఎస్పీ

  • రామకృష్ణ కుటుంబం ఆత్మహత్య కేసులో విచార‌ణ‌
  • రాఘ‌వ‌ను 10 గంట‌లు విచారించిన పోలీసులు
  • పాల్వంచలో ప‌లు సెక్ష‌న్ల కింద కేసుల న‌మోదు
raghava accepts allegations

తెలంగాణ‌లోని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచలో రామకృష్ణ కుటుంబం ఆత్మహత్య కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు కుమారుడు వనమా రాఘవేంద్రరావును పోలీసులు అరెస్టు చేసిన విష‌యం తెలిసిందే. దమ్మపేట మండ‌లం మందలపల్లి వద్ద రాఘవతో పాటు అతడి ప్రధాన అనుచరుడు గిరీశ్, కారు డ్రైవర్ ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

ఈ కేసు గురించి పాల్వంచ‌ ఏఎస్పీ రోహిత్ రాజ్ ఈ రోజు మీడియా స‌మావేశం నిర్వ‌హించి అధికారికంగా అన్ని వివ‌రాలు తెలిపారు. రాఘవను విచారణ కోసం పాల్వంచకు తరలించామ‌ని, దాదాపు 10 గంట‌ల పాలు ఆయ‌న‌ను విచారించామ‌ని చెప్పారు. సబ్డివిజన్ కార్యాలయంలో విచారణ కొన‌సాగించామ‌ని, ఆయ‌న‌పై నమోదైన కేసులు, ఆరోపణలపై ప్ర‌శ్నించామ‌న్నారు.

రామ‌కృష్ణ‌ను బెదిరించిన‌ట్లు వ‌న‌మా రాఘ‌వ అంగీక‌రించాడ‌ని ఆయ‌న తెలిపారు. ఈ నెల 3న పాత పాల్వంచ‌లో రామ‌కృష్ణ కుటుంబం ఆత్మ‌హ‌త్య చేసుకుంద‌ని గుర్తు చేశారు. రామ‌కృష్ణ దంప‌తు‌లు, ఇద్ద‌రు కుమార్తెలు మృతి చెందార‌ని తెలిపారు. భార్య‌, కుమార్తెల‌పై పెట్రోల్ పోసి నిప్పు అంటించి, తన‌కు కూడా నిప్పు అంటించుకుని రామ‌కృష్ణ ఆత్మ‌హ‌త్య చేసుకున్నాడ‌ని వివ‌రించారు. అనంత‌రం రామ‌కృష్ణ బావ‌మ‌రిది జ‌నార్ద‌న్ చేసిన ఫిర్యాదుతో తాము కేసు న‌మోదు చేశామ‌ని తెలిపారు.

త‌న భార్య‌ను కూడా ఆశించాడ‌ని రామ‌కృష్ణ చెప్పారు  

పాల్వంచ పోలీస్ స్టేష‌న్లో ప‌లు సెక్ష‌న్ల కింద కేసు న‌మోదు చేసిన‌ట్లు చెప్పారు. ఆత్మ‌హ‌త్య లేఖ‌, సెల్ఫీ వీడియోలో రామ‌కృష్ణ వ‌న‌మా రాఘ‌వ‌పై ఆరోప‌ణ‌లు చేశార‌ని ఏఎస్పీ తెలిపారు. ఆత్మ‌హ‌త్య‌కు ఆర్థిక ఇబ్బందులు, ఇత‌ర కార‌ణాలు ఉన్నాయ‌ని రామ‌కృష్ణ చెప్పార‌ని తెలిపారు. త‌న భార్య‌ను కూడా రాఘవ ఆశించాడ‌ని రామ‌కృష్ణ వీడియోలో పేర్కొన్నారని ఆయ‌న వివ‌రించారు. ఇప్ప‌టి వ‌ర‌కు ల‌భ్య‌మైన ఆధారాల‌ను సీజ్ చేసి కోర్టుకు స‌మ‌ర్పించామ‌ని తెలిపారు.

More Telugu News