Keto diet: కీటో డైట్ తో నిజంగా బరువు తగ్గొచ్చా..? బోలెడన్ని ప్రయోజనాలు ఉన్నాయా..?

Ravindra Jadeja shares funny tweet about Keto diet
  • స్వల్పకాలంలో బరువు తగ్గొచ్చు
  • కానీ దీర్ఘకాలంలో ఎన్నో దుష్ప్రభావాలు
  • పోషకాలు తగినంత అందవు
  • ఆస్టియోపోరోసిస్, మలబద్ధక సమస్యలు
  • ప్రఖ్యాత పరిశోధనా సంస్థలు చెబుతున్నదిదే

కీటో డైట్ (కీటోన్స్ తో కూడిన) గురించి మనం కొత్తగా వింటున్నాం కానీ, ఎంతో ప్రాచీనమైన ఆహార విధానం ఇది. తాజాగా క్రికెటర్ రవీంద్ర జడేజా కీటో డైట్ ను ప్రస్తావిస్తూ ట్విట్టర్ లో షేర్ చేసిన ఒక ఫొటో చూసినవారిని ఆలోచనలో పడేస్తుంది. అస్థిపంజరం పక్కన జడేజా నించుని.. ‘కీటో డైట్ తర్వాత నా మిత్రుడ్ని చూడండి’ అంటూ పోస్ట్ పెట్టాడు. కీటో డైట్ తో అస్థి పంజరం మాదిరిగా స్లిమ్ అయిపోతారా? అన్న ప్రశ్న ఎదురైంది.

1920ల్లోనే ఆవిష్కరణ
హార్వర్డ్స్ టీహెచ్ చాన్ స్కూల్ ఆఫ్ పబ్లిక్ హెల్త్ చెబుతున్న దాని ప్రకారం.. కీటో డైట్ 19వ శతాబ్దం నుంచి ఆచరణలో ఉన్నది. 1920లో పిల్లల్లో మూర్ఛ వ్యాధికి పరిష్కారంగా దీన్ని కనిపెట్టారు. అంతేకాదు కేన్సర్, మధుమేహం, పాలీసిస్టిక్ ఓవరీస్ సిండ్రోమ్, ఆల్జీమర్స్ వ్యాధులపై దీన్ని ప్రయోగించి చూశారు. కార్బోహైడ్రేట్లు తక్కువగా ఉన్న ఆహారం తీసుకోవాలంటూ వైద్యులు సూచిస్తున్న క్రమంలో ఇన్నాళ్ల తర్వాత కీటో ఆహారానికి ఇంత ప్రాచుర్యం ఏర్పడిందని చెప్పుకోవాలి.

ఎలా పనిచేస్తుంది..?
శరీరాన్ని గ్లూకోజుపై ఆధారపడటాన్ని తగ్గించి, కీటోన్లపైకి మళ్లించడమే ఈ ఆహార విధానం. కార్బొహైడ్రేట్లు ఉన్న (రైస్, స్వీట్లు) ఆహారాన్ని తక్కువగా తీసుకుంటే.. అప్పుడు శరీరానికి శక్తి చాలదు. దీంతో ప్రొటీన్లు, కొవ్వులను బ్రేక్ చేసుకుని శక్తిగా మార్చుకుంటుంది. శరీరంలో నిల్వ ఉన్న కొవ్వులు కరిగిపోతాయి. ఇదే బరువు తగ్గేందుకు సాయపడుతుంది.

దుష్ప్రభావాలు
కీటోడైట్ వల్ల స్వల్పకాలంలో ప్రయోజనాలు కనిపిస్తాయి. కానీ, అలా కొంతకాలం పాటు కార్బొహైడ్రేట్లు తక్కువ, కొవ్వు అధికంగా ఉండే ఆహారాన్ని తీసుకుంటూ వెళితే కిడ్నీలో రాళ్లు, ఆస్టియోపోరోసిస్, రక్తంలో యూరిక్ యాసిడ్ పెరిగిపోవడం, పోషకాల లేమికి దారితీస్తుందని టీహెచ్ చాన్ స్కూల్ ఆఫ్ పబ్లిక్ హెల్త్ అంటోంది.

ప్రపంచ ప్రసిద్ధ మాయో క్లినిక్ సైతం ఇదే చెబుతోంది. దీర్ఘకాలం పాటు కీటో డైట్ తీసుకుంటే మూర్ఛకు పనికొస్తుందేమో తప్పించి.. ఇతరత్రా దీనితో వచ్చే ప్రయోజనాలు ఏమీ లేవని పేర్కొంది. పైగా తక్కువ కార్బొహైడ్రేట్లతో మలబద్ధకం, తలనొప్పి, నోటి నుంచి దుర్వాసన సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుందని తెలిపింది. కీటో డైట్ లో ఆరోగ్యకరమైన ఆహారాలకు చోటు ఉండదు కనుక పోషక అవసరాలు తీరవని చెబుతోంది. వైద్యులను సంప్రదించకుండా సొంతంగా కీటో డైట్ తరహా విధానాలను ఆశ్రయించడం సురక్షితం కాదని అర్థం చేసుకోవాలి.

  • Loading...

More Telugu News