Corona Virus: ప్రారంభమవుతున్న కరోనా బూస్టర్ డోస్ వ్యాక్సినేషన్.. తొలుత ఎవరికి వేస్తారు? రిజిస్ట్రేషన్ తదితర వివరాలు!

  • జనవరి 10 నుంచి బూస్టర్ డోస్ వ్యాక్సినేషన్
  • హెల్త్ కేర్, ఫ్రంట్ లైన్ వర్కర్లు, అనారోగ్యాలతో బాధ పడుతున్న 60 ఏళ్లు పైబడిన వారికి వ్యాక్సినేషన్
  • బూస్టర్ డోస్ కోసం రిజిస్ట్రేషన్ అవసరం లేదు
New Registration Not Needed For Covid Vaccine Booster Shot

దేశ వ్యాప్తంగా కరోనా థర్డ్ వేవ్ పంజా విసురుతోంది. డెల్టా వేరియంట్ తో పాటు, ఒమిక్రాన్ వేరియంట్ కేసులు కూడా పెరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో వ్యాక్సినేషన్ ప్రక్రియ కూడా వేగంగా జరుగుతోంది. ఇప్పటికే చాలా మంది రెండు డోసుల టీకా తీసుకున్నారు. అయితే, కేసులు మళ్లీ పెరుగుతున్న తరుణంలో బూస్టర్ డోస్ గురించి ఎక్కువ చర్చ జరుగుతోంది. బూస్టర్ డోస్ ల కోసం వ్యాక్సిన్ పంపాలని కేంద్రాన్ని పలు రాష్ట్రాలు కోరుతున్నాయి.

ఈ నేపథ్యంలో బూస్టర్ డోస్ వ్యాక్సినేషన్ కార్యక్రమానికి కేంద్రం శ్రీకారం చుడుతోంది. జనవరి 10 నుంచి వ్యాక్సినేషన్ ప్రారంభం కాబోతోంది. ఈ నేపథ్యంలో కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ కీలక ప్రకటన చేసింది.

బూస్టర్ డోస్ వేయించుకోవాలనుకునే వారు కొత్తగా రిజిస్ట్రేషన్ చేయించుకోవాల్సిన అవసరం లేదని కేంద్రం తెలిపింది. జనవరి 10 నుంచి హెల్త్ కేర్ వర్కర్లు, ఫ్రంట్ లైన్ వర్కర్లు, అనారోగ్య కారణాలతో బాధ పడుతున్న 60 ఏళ్లు పైబడిన వారికి బూస్టర్ డోస్ ఇవ్వనున్నారు. అర్హత కలిగిన వారందరూ ముందస్తు రిజిస్ట్రేషన్ లేకుండానే నేరుగా ఏదైనా కోవిడ్ సెంటర్ కు వెళ్లి బూస్టర్ డోస్ వేయించుకోవచ్చు.

బూస్టర్ డోస్ కోసం ఆన్ లైన్ అపాయింట్ మెంట్ కార్యాచరణ కూడా నిన్న సాయంత్రం నుంచి ప్రారంభమయింది. జనవరి 10 నుంచి ఆన్ సైట్ అపాయింట్ మెంట్లు (నేరుగా వ్యాక్సినేషన్ సెంటర్ కు వెళ్లడం) ప్రారంభమవుతాయి. మరోవైపు ఇప్పటి వరకు వేయించుకున్న రెండు డోసుల టీకాకు, బూస్టర్ డోస్ కు ఎలాంటి తేడా ఉండదు. బూస్టర్ డోసు కూడా ఇంతకు ముందు వేయించుకున్న టీకానే అని కేంద్ర ఆరోగ్యశాఖ తెలిపింది. ఇంతకు ముందు కోవాగ్జిన్ వేయించుకున్న వారు బూస్టర్ డోస్ గా కోవాగ్జిన్ నే తీసుకోవాలని, అదే విధంగా కోవిషీల్డ్ తీసుకున్న వారు బూస్టర్ డోస్ గా అదే టీకాను వేయించుకోవాలని తెలిపింది.

More Telugu News