రికార్డ్ సృష్టించిన బాలయ్య అన్ స్టాపబుల్.. మొదలైన మూడు నెలల్లోనే ఐఎండీబీ టాప్ 10 లిస్టులో చోటు

07-01-2022 Fri 14:43
  • రియాలిటీ షోల్లో ఐదో స్థానంలో అన్ స్టాపబుల్
  • గత ఏడాది నవంబర్ 4న మొదలైన షో
  • టాప్ టెన్ లో బిగ్ బాస్ తెలుగుకూ స్థానం
Unstoppable With NBK Takes Spot In IMDB Top 10 List
తనదైన శైలిలో సినీ తారలను ఇంటర్వ్యూ చేస్తూ స్టాప్ అన్నదే లేకుండా దూసుకెళ్తున్నారు నందమూరి బాలకృష్ణ. ఆహా ఓటీటీలో ప్రసారమవుతున్న ‘అన్ స్టాపబుల్’ రియాలిటీ షోతో అందరి మన్ననలనూ ఆయన అందుకుంటున్నారు. రియాలిటీ షోలు నిర్వహించిన జాబితాలో ఇప్పటికే మెగాస్టార్ చిరంజీవి, నాగార్జున, జూనియర్ ఎన్టీఆర్, నానిలు ఉన్నారు. అయితే, బాలకృష్ణ అన్ స్టాపబుల్ కు మాత్రం ఊహించని స్థాయిలో స్పందన వచ్చింది.


షోలో బాలకృష్ణ టైమింగ్, ఎనర్జీ, ఆహార్యాలతో అదరగొట్టేస్తున్నారు. అతిథులను ఆడిస్తూ, పాడిస్తూ సరదా సరదాగా షోను నడిపించేస్తున్నారు. అలాంటి ఈ షో ఇప్పుడు ఓ అరుదైన ఘనతను దక్కించుకుంది. ఇంటర్నేషనల్ మూవీ డేటా బేస్ (ఐఎండీబీ) విడుదల చేసిన రేటింగ్స్ లో ఇది రికార్డ్ సాధించింది. గత ఏడాది నంబర్ 4 ప్రారంభమైన అన్ స్టాపబుల్ టాప్ 10 రియాలిటీ షోల జాబితాలో చోటు సంపాదించింది. ఐదో స్థానాన్ని దక్కించుకుని అరుదైన ఘనతను సొంతం చేసుకుంది. ప్రారంభమైన మూడు నెలల్లోనే లిస్టులో ఈ రియాలిటీ షో చోటు సంపాదించుకోవడం విశేషమని ఐఎండీబీ పేర్కొంది.

కాగా, ఇంతటి ఆదరణ ఇచ్చిన ప్రేక్షకులకు ఆహా యాజమాన్యం కృతజ్ఞతలు తెలిపింది. ప్రస్తుతం ఏడు ఎపిసోడ్లను పూర్తి చేసుకున్న అన్ స్టాపబుల్.. మరో మూడు ఎపిసోడ్లు అయ్యాక తొలి సీజన్ ను పూర్తి చేసుకుంటుందని చెబుతున్నారు. 8వ ఎపిసోడ్ లో భాగంగా ఇవాళ దగ్గుబాటి రానాను బాలకృష్ణ ఇంటర్వ్యూ చేయనున్నారు.

టాప్ టెన్ లో నిలిచిన ఇండియన్ రియాలిటీ షోలు వరుసగా షార్క్ ట్యాంక్ ఇండియా, బిగ్ బాస్ తెలుగు, బిగ్ బాస్, ఫాబ్యులస్ లైవ్స్ ఆఫ్ బాలీవుడ్ వైవ్స్, అన్ స్టాపబుల్ విత్ ఎన్బీకే, ద బిగ్ పిక్చర్, ఇండియన్ మ్యాచ్ మేకింగ్, ఎంటీవీ రోడీస్, ఫియర్ ఫ్యాక్టర్: ఖత్రోం కే ఖిలాడీ, డ్యాన్స్ ప్లస్.