Somu Veerraju: పాపం.. సోము వీర్రాజుకు అప్పుడెందుకు బాధ కలగలేదో?: కాంగ్రెస్ నాయకురాలు సుంకర పద్మశ్రీ

  • పంజాబ్‌లో మోదీకి అవమానం జరిగిందని బాధపడిపోతున్నారు
  • మరి 700 మంది రైతులు చనిపోతే బాధెందుకు రాలేదో
  • రాష్ట్రంలో ప్రజల హక్కులు కాలరాస్తున్నా బాధలేదు
  • ప్రధాని శంకుస్థాపన చేసిన అమరావతి గాలికెగిరినా బాధలేదన్న పద్మశీ 
Congress leader Sunkara Padmasri slams ap bjp chief somu veerraju

ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజుపై ఏపీ కాంగ్రెస్ సమన్వయ కమిటీ సభ్యురాలు సుంకర పద్మశ్రీ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. పంజాబ్‌లో ప్రధాని మోదీని అవమానించారని వీర్రాజు చాలా బాధపడిపోతున్నారని, మరి వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా పోరాడిన రైతుల్లో బడుగు, బలహీన వర్గాలకు చెందిన 700 మంది రైతులు చనిపోతే వీర్రాజుకు ఎందుకు బాధ కలగలేదో? అని ప్రశ్నించారు.

ఏపీలో తాము కూడా ఉన్నామని చెప్పడానికి బీజేపీ నేతలు పడుతున్న అవస్థలు చూస్తుంటే జాలేస్తోందని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రజల హక్కులను  కాలరాస్తున్నా వీర్రాజుకు బాధకలగలేదని, ప్రత్యేక హోదా, పోలవరం, విభజన హామీలు, రాజధాని నిర్మాణం, రైల్వే జోన్ హామీలు గాల్లో కలిసిపోయినా వీర్రాజు గుండె చెరువు కాలేదని, కానీ ప్రధానికి అవమానం జరిగిందని మాత్రం తెగ బాధపడిపోతున్నారని ధ్వజమెత్తారు.

అమరావతి కోసం భూములిచ్చిన రైతులపై రాష్ట్ర ప్రభుత్వం దమనకాండకు పాల్పడుతున్నా బీజేపీ నేతలు పత్తాలేకుండా పోయారని, అమరావతికి శంకుస్థాపన చేసింది కూడా మోదీయేనన్న సంగతిని వారు మర్చిపోయినట్టు ఉన్నారని ఎద్దేవా చేశారు. బీజేపీకి ఏమైనా జరిగితే ఆ పార్టీ నేతలు స్పందిస్తారో లేదో తెలియదు కానీ బాలీవుడ్ నటి కంగన రనౌత్ మాత్రం వెంటనే కన్నీరు పెట్టేసుకుంటారని పేర్కొన్న పద్మశ్రీ.. మోదీ ట్రాప్‌లో పడి భారతీయులను అవమానించొద్దని విజ్ఞప్తి చేశారు.

More Telugu News