Andhra Pradesh: పులివెందులలో ఓటు హక్కున్న జగన్ ఇక్కడ నిర్ణయాలు ఎలా తీసుకుంటారు?: సోమిరెడ్డి

  • అమరావతి మున్సిపల్ క్యాపిటల్ కార్పొరేషన్ ఏర్పాటుపై మండిపాటు
  • ఓటు హక్కున్నోళ్లే అభిప్రాయం చెప్పాలనడమేంటని నిలదీత
  • రైతుల భూములను తాకట్టు పెట్టి రుణాలు తీసుకునే కుట్రని ఆరోపణ
Somireddy Chandramohan Reddy Criticizes Amaravati Municipal Capital Corporation

రాజధాని పరిధిని కొన్ని గ్రామాలకే పరిమితం చేసేలా అమరావతి మున్సిపల్ కార్పొరేషన్ ను ప్రభుత్వం ఏర్పాటు చేస్తోందని టీడీపీ సీనియర్ నేత సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ఆరోపించారు. అమరావతి మున్సిపల్ క్యాపిటల్ కార్పొరేషన్ అనే పేరులోనే క్యాపిటల్ సిటీ అంటూ కుట్రకు తెరదీశారని ఆరోపించారు.

బ్యాంకుల నుంచి రుణాలు తీసుకోవడం కోసమే రాజధానికి భూములిచ్చిన రైతులను సీఎం జగన్ పీడిస్తున్నారని, ప్రజలను హింసిస్తే కానీ ఆయనకు నిద్ర పట్టడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇవాళ మంగళగిరిలోని టీడీపీ ఆఫీసులో ఆయన మీడియాతో మాట్లాడారు.

కార్పొరేషన్ ను వ్యతిరేకిస్తూ ప్రజలు తీర్మానాలు చేస్తున్నారని ఆయన అన్నారు. అయితే, ఓటు హక్కు ఉన్నవాళ్లే అభిప్రాయాలను చెప్పాలని జగన్ అనడం ఏంటని ప్రశ్నించారు. మరి, పులివెందులలో ఓటు హక్కున్న జగన్ ఇక్కడ నిర్ణయాలు ఎలా తీసుకుంటారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

రాజధాని పరిధిలోని 29 గ్రామాలను 19 గ్రామాలకు కుదిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని, అన్ని గ్రామాలను ఒకే కార్పొరేషన్ కిందకు తీసుకురావాలని ఆయన డిమాండ్ చేశారు. అమరావతి పరిధిలో ఎకరం భూమి రూ.7 కోట్లుగా ఉందని, 480 ఎకరాలను తాకట్టు పెట్టేందుకు ఇప్పటికే నివేదికను సిద్ధం చేశారని ఆయన ఆరోపించారు. ఇప్పుడు రూ.2 లక్షల కోట్ల విలువైన మొత్తం 34 వేల ఎకరాల భూములనూ తాకట్టు పెట్టేందుకు రెడీ అయ్యారని ఆరోపించారు.

రైతుల సమస్యలను పరిష్కరించాల్సిందిపోయి వారి భూములను తాకట్టు పెడుతున్నారని, రైతులకు వ్యతిరేకంగా నిర్ణయాలు తీసుకుంటే జగన్ ను ఆ దేవుడు కూడా క్షమించలేడని విమర్శించారు. కోర్టు ఆదేశాలనూ ప్రభుత్వం ఉల్లంఘిస్తోందంటూ మండిపడ్డారు.

More Telugu News