BJP: సుప్రీంకోర్టుకు చేరిన ప్రధాని మోదీ పంజాబ్ పర్యటన భద్రతా వైఫల్యం వివాదం

Supreme Court To Hear The Petition Of PM Security Lapse In Punjab
  • పంజాబ్ ప్రభుత్వం పాత్ర ఉందంటూ సీనియర్ అడ్వొకేట్ పిటిషన్
  • సమగ్ర విచారణ జరిపించాల్సిందిగా విజ్ఞప్తి
  • పంజాబ్ సర్కారును ప్రతివాదిగా చేర్చాలన్న సీజేఐ జస్టిస్ ఎన్వీ రమణ
  • దర్యాప్తు కమిటీని నియమించిన పంజాబ్ ప్రభుత్వం
  • మూడు రోజుల్లో రిపోర్ట్ ఇవ్వనున్న రిటైర్డ్ జస్టిస్ నేతృత్వంలోని కమిటీ
ప్రధాని నరేంద్ర మోదీ పంజాబ్ పర్యటనలో భద్రతా వైఫల్యం వ్యవహారం సుప్రీంకోర్టుకు చేరింది. మహీందర్ సింగ్ అనే సీనియర్ అడ్వొకేట్ ఇవాళ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. భద్రతా లోపాలపై పంజాబ్ ప్రభుత్వం పాత్ర ఉందని, దీనిపై సమగ్ర విచారణ జరిపించాల్సిన అవసరం ఉందని పేర్కొంటూ ఆయన వ్యాజ్యం వేశారు.

ఇలాంటివి జరగకుండా చూడాల్సిన బాధ్యత ప్రభుత్వానిదేనని పిటిషనర్ అన్నారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, డీజీపీలు బాధ్యులని, వారిని సస్పెండ్ చేసి శాఖాపరమైన చర్యలను తీసుకోవాలని కోరారు. అయితే, ఇందులో రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రతివాదిగా చేరుస్తూ పిటిషన్ కాపీ దాఖలు చేయాల్సిందిగా పిటిషనర్ కు చీఫ్ జస్టిస్ ఎన్వీ రమణ సూచించారు. వ్యాజ్యాన్ని రేపు విచారిస్తామని చెప్పారు.

మరోపక్క, ఈ ఘటనపై దర్యాప్తు చేసేందుకు పంజాబ్ ప్రభుత్వం కూడా దర్యాప్తు కమిటీని నియమించింది. పంజాబ్, హర్యానా హైకోర్టు రిటైర్డ్ జడ్జి జస్టిస్ మెహతాబ్ గిల్, హోం, న్యాయ శాఖ ముఖ్య కార్యదర్శి అనురాగ్ వర్మలతో కూడిన ఇద్దరు సభ్యుల కమిటీ.. ఘటనపై విచారణ చేయనుంది. మూడు రోజుల్లో నివేదికను అందించనుంది.

ఇటు కేంద్ర హోం శాఖ వర్గాలు పంజాబ్ ప్రభుత్వ తీరుపై ఇవాళ ఆగ్రహం వ్యక్తం చేశాయి. బ్లూ బుక్ ప్రకారం ప్రధాని పర్యటనకు కంటింజెన్సీ మార్గాన్ని పోలీసులు సిద్ధం చేయాల్సి ఉంటుందని, అందులో రాష్ట్ర పోలీసులు విఫలమయ్యారంటూ సీనియర్ అధికారి మండిపడ్డారు.  

ప్రధాని వెళ్లే మార్గంలో రైతులు నిరసన చేస్తున్నారన్న విషయాన్ని నిఘా వర్గాలు తెలియజేయాల్సిన అవసరం ఉందని స్పష్టం చేశారు. స్పెషల్ ప్రొటెక్షన్ గ్రూప్ (ఎస్పీజీ) అధికారులు ప్రధాని దగ్గర భద్రతగా ఉంటారని, కాన్వాయ్ వెళ్లే మార్గంలో భద్రతా వ్యవహారాలు చూసుకోవాల్సిన బాధ్యత రాష్ట్ర పోలీసులదేనని తేల్చి చెప్పారు. ఆయా మార్గాల్లో ఉన్న ముప్పులను పసిగట్టాల్సిన బాధ్యత పోలీసులదేనన్నారు.

కాగా, నిన్న పంజాబ్ లోని ఫిరోజ్ పూర్ లో ప్రధాని మోదీ బహిరంగ సభ జరగాల్సి ఉన్న సంగతి తెలిసిందే. అయితే, హెలికాప్టర్ లో వెళ్లాల్సిన ఆయన.. వర్షం కారణంగా టూర్ షెడ్యూల్ ను మార్చుకున్నారు. ఎయిర్ పోర్టులో గంట వేచి చూసిన తర్వాత కూడా వాతావరణం మెరుగు పడకపోవడంతో.. రోడ్డు మార్గంలో వెళ్లాలని నిర్ణయించుకున్నారు. ఇదే విషయాన్ని పంజాబ్ ప్రభుత్వానికి వివరించారు. అయితే, గమ్యానికి 10 కిలోమీటర్ల దూరంలో కొందరు నిరసనకారులు ఫ్లై ఓవర్ పై అడ్డుకోవడంతో.. దాదాపు 20 నిమిషాల పాటు ఆయన కాన్వాయ్ రోడ్డుపైనే ఉండిపోవాల్సి వచ్చింది.

ఇప్పుడు ఘటన రాజకీయ రంగు పులుముకుంది. ప్రధానిని చంపేందుకు ప్రయత్నిస్తున్నారా? అంటూ స్మృతి ఇరానీ మండిపడ్డారు. మరోపక్క, జనాలు ఎవరూ రాకపోవడంతోనే ప్రధాని వెనుదిరిగారంటూ పంజాబ్ ముఖ్యమంత్రి చరణ్ జిత్ సింగ్ చన్నీ వ్యంగ్యంగా అన్నారు. ‘హౌ ఈజ్ ద జోష్’ అంటూ ఓ కాంగ్రెస్ నేత వివాదాస్పద రీతిలో కామెంట్ చేశారు. ఇప్పుడు వీటిపై బీజేపీ నేతలు మండిపడుతున్నారు.
BJP
Congress
Prime Minister
Narendra Modi
Punjab
Supreme Court
Justice N.V. Ramana

More Telugu News