London man: పెద్దలు కుదిర్చే వివాహం నుంచి నన్ను కాపాడండి.. బిల్ బోర్డులపై బ్రిటన్ యువకుడి ప్రకటనలు

29 year old London man uses billboard ad to find a wife
  • బ్రిటన్ లోని బర్మింగ్ హామ్ పట్టణంలో దర్శనం
  • మహమ్మద్ మాలిక్ అనే యువకుడి కొత్త ప్రయత్నం
  • జీవిత భాగస్వామిని వెతుక్కునే ఆరాటం
  • ప్రత్యేకంగా ఒక వెబ్ సైట్ రూపకల్పన
‘ఇల్లు కట్టి చూడు పెళ్లి చేసి చూడు’.. సొంతిల్లు, వివాహం విషయంలో ఉండే కష్టాన్ని ప్రతిఫలిస్తూ వెనుకటి పెద్దలు చెప్పిన సామెత. దీన్ని ఓ యవకుడు నిజంగా కళ్లకు కడుతున్నాడు. సాధారణంగా ఓ ఇంటి వారయ్యేందుకు.. చక్కని జీవిత భాగస్వామిని వెతుక్కునేందుకు ఎవరైనా ఏం చేస్తారు? బంధు మిత్రుల ద్వారా సంబంధాలను ఆరాతీయడం, పెళ్లిళ్ల పేరయ్యలను సంప్రదించడం, ఆన్ లైన్ లో పుట్టుకొచ్చిన పెళ్లిళ్ల బ్రోకర్ సైట్లను ఆశ్రయించడం చేస్తుంటారు.

కొందరు ఈ వెతుక్కునే శ్రమ కూడా లేకుండా కాలేజీలో, కార్యాలయంలో తోటి వారిలో తమకు నచ్చిన వారితో ప్రేమలో పడిపోయి పెళ్లి పీటలు ఎక్కుతుంటారు. కానీ, బ్రిటన్ కు చెందిన చెందిన మహమ్మద్ మాలిక్ (29) ఏకంగా రోడ్డు పక్కన బిల్ బోర్డుపై భారీ ప్రకటనలు ఇచ్చాడు. ‘‘నన్ను అరేంజ్డ్ మ్యారేజ్ (పెద్దలు కుదిర్చే వివాహం) నుంచి కాపాడండి’’అన్నది ఆ ప్రకటన సారాంశం. బర్మింగ్ హామ్ పట్టణంలో ఈ ప్రకటనలు దర్శనమిచ్చాయి.

ప్రకటన కింది భాగంలో findMALIKawife.com అనే వెబ్ సైట్ చిరునామాను కూడా రాయించుకున్నాడు. అంటే తన జీవిత భాగస్వామిని గుర్తించేందుకు ప్రత్యేకంగా వెబ్ సైట్ ను తయారు చేయించుకుని, ప్రకటనల రూపంలో అందరి దృష్టిలో పడాలన్న అతడి తపన నిజంగా వినూత్నమైనది. దీనికి నెటిజన్ల నుంచి కూడా మంచి స్పందన కామెంట్ల రూపంలో లభిస్తోంది.

వెబ్ సైట్ కు వెళితే.. ‘నేను మాలిక్. భార్యను గుర్తించడంలో సాయం చేయండి’ అంటూ హోమ్ పేజీలో పెద్ద క్యాప్షన్ కనిపిస్తుంది. దాని కింద ‘ఇది హాస్యం కాదు’ అన్న ట్యాగ్ ను కూడా మాలిక్ తగిలించాడు.

‘‘నాకు కాబోయే చక్కని భాగస్వామి 20 సంవత్సరాలు దాటిన ముస్లిం మహిళ అయి ఉండాలి. జాతి భేదం లేదు. కానీ, నాకు ఒక పెద్ద పంజాబీ కుటుంబం ఉంది. కాబోయే భార్య వారితో కలిసి ఉండాలి’’ అంటూ ప్రాథమిక అర్హతల గురించి ప్రస్తావించాడు.

‘నీకు మంచి జరగాలి’, ‘త్వరలోనే భార్యతో కలిసి నిన్ను చూడాలి’ అని కొందరు కోరుకుంటూ కామెంట్లు పెట్టారు. ఒకరు అయితే మతం మారి నిన్ను పెళ్లాడాలనుకుంటున్నాను అనగా.. మరొకరు ‘నేను కూడా నీ మాదిరే చేయాల్సి వస్తుందేమో’ అంటూ చమత్కరించారు.
London man
billboard
finding life partner

More Telugu News