West Bengal: పశ్చిమ బెంగాల్ బీజేపీలో లుకలుకలు.. పార్టీ వాట్సాప్ గ్రూపుల నుంచి కేంద్రమంత్రి ఎగ్జిట్!

  • వరుసపెట్టి ఎగ్జిట్ అవుతున్న ఎమ్మెల్యేలు
  • పార్టీ అధినాయకత్వంలో కలవరం
  • రాష్ట్ర, జిల్లా కమిటీల్లో మటువా సామాజిక వర్గానికి ప్రాతినిధ్యం లభించకపోవడమే కారణం
  • భవిష్యత్ కార్యాచరణ ప్రకటిస్తానన్న కేంద్రమంత్రి శంతను ఠాకూర్
  • షా, నడ్డా రాకకు ముందే సమస్య పరిష్కారం కోసం యత్నం
Rift in Bengal BJP Union Minister exits party WhatsApp groups

పశ్చిమ బెంగాల్ బీజేపీలో లుకలుకలు తారస్థాయికి చేరాయి. కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా రాష్ట్రాన్ని సందర్శించనున్న వేళ కేంద్ర సహాయమంత్రి శంతను ఠాకూర్ పార్టీకి చెందిన వివిధ వాట్సాప్ గ్రూపుల నుంచి తప్పుకోవడం ప్రాధాన్యం సంతరించుకుంది. పార్టీ వాట్సాప్ గ్రూపుల నుంచి క్విట్ అయినట్టు స్వయంగా శంతను ఠాకూర్ ప్రకటించారు.

అయితే, ఈ విషయంపై మాత్రం పార్టీ రాష్ట్ర నాయకత్వం గుంభనంగా ఉంది. మటువా సామాజిక వర్గానికి చెందిన శంతను ఠాకూర్ బాంగావ్ లోక్‌సభ స్థానానికి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. రాష్ట్ర, జిల్లా స్థాయుల్లో ఇటీవల నియమించిన కమిటీల్లో తమ మటువా సామాజిక వర్గానికి ఎలాంటి ప్రాతినిధ్యం లభించడం లేదన్న అసంతృప్తి కారణంగానే ఆయన ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది.

వాట్సాప్ గ్రూపుల నుంచి తప్పుకోవడంపై మీడియా అడిగిన ప్రశ్నకు సమాధానం చెప్పేందుకు కూడా ఠాకూర్ నిరాకరించారు. దీనిపై తాను స్పందించబోనని పేర్కొన్న ఆయన.. సరైన సమయం వచ్చాక దీనికి కారణం చెప్పడంతోపాటు భవిష్యత్ కార్యాచరణ కూడా ప్రకటిస్తానని చెప్పి మరింత వేడి రాజేశారు.

రాష్ట్ర కమిటీ నుంచి తమను తప్పించినందుకు నిరసనగా డిసెంబరు 25న ఐదుగురు ఎమ్మెల్యేలు.. ముకుట్మోని అధికారి, సుబ్రతా ఠాకూర్, అంబికా రాయ్, అశోక్ కీర్టానియా, అసీమ్ సర్కార్ పార్టీకి చెందిన పలు వాట్సాప్ గ్రూపుల నుంచి తప్పుకుని కలకలం రేపారు. వీరిలో అత్యధికులు మటువా సామాజిక వర్గానికి చెందినవారు కావడం గమనార్హం.

ఈ ఘటన జరిగిన తర్వాతి రోజే బంకురా జిల్లాకు చెందిన మరో నలుగురు ఎమ్మెల్యేలు.. అమర్‌నాథ్ శంఖ, దిబాకర్ ఘోరమి, నీలాద్రి శేఖర్ దానా, నిర్మల్ ధారా కూడా వాట్సాప్ గ్రూపుల నుంచి తప్పుకోవడంతో పార్టీలో ఏదో జరుగుతోందన్న వార్తలు గుప్పుమన్నాయి. దీంతో నష్టనివారణ చర్యలు ప్రారంభించిన పార్టీ సీనియర్ నేతలు చర్చలు జరపడంతో వీరిలో కొందరు మళ్లీ ఆయా వాట్సాప్ గ్రూపుల్లో జాయిన్ అయ్యారు.

గత నెలలో కోల్‌కతా మునిసిపాలిటీకి జరిగిన ఎన్నికల్లో బీజేపీ ఘోర పరాజయం పాలైంది. దీనిపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసిన అధిష్ఠానం రాష్ట్ర కమిటీని పునరుద్ధరించింది. అయితే, వీరిలో మటువా సామాజిక వర్గానికి చెందిన వారికి ప్రాతినిధ్యం లభించలేదు. అంతేకాదు, జిల్లాస్థాయి యూనిట్లలోనూ మటువా ముఖాలు కనిపించలేదు. ఇక్కడ మటువా సామాజిక వర్గం ఓటర్లు అధిక సంఖ్యలో ఉన్నప్పటికీ ఆ సామాజిక వర్గానికి ప్రాతినిధ్యం లభించకపోవడంతో అసంతృప్తి మొదలై అది చివరికి ఇలాంటి పరిస్థితికి దారితీసింది.
 
వాట్సాప్ గ్రూపుల నుంచి శంతను ఠాకూర్ తప్పుకోవడంపై రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు సుకాంత మజుందార్ మాట్లాడుతూ... ఇది పార్టీ అంతర్గత విషయమని, ఆయనతో మాట్లాడి సమస్యను పరిష్కరించుకుంటామని పేర్కొన్నారు. కాగా, ఈ నెల 9న జేపీ నడ్డా, చివరి వారంలో అమిత్ షా రాష్ట్రంలో పర్యటించనున్న నేపథ్యంలో ఆ లోపే సమస్యను పరిష్కరించాలని రాష్ట్ర నాయకత్వం భావిస్తోంది.

More Telugu News