Vaccination: టీనేజర్లకు టీకాలో పొరపాటు.. కొవాగ్జిన్‌కు బదులు కొవిషీల్డ్ వేసిన బీహార్ సిబ్బంది

  • దేశవ్యాప్తంగా చురుగ్గా వ్యాక్సినేషన్ కార్యక్రమం
  • నలంద జిల్లాలో వ్యాక్సినేషన్ సిబ్బంది నిర్లక్ష్యం
  • కొవిషీల్డ్ వేసి కొవాగ్జిన్ వేసినట్టుగా ధ్రువీకరణ పత్రం
  • సిబ్బందిపై ఉన్నతాధికారుల వేటు
Two teens gets Covishield shots instead of Covaxin in Bihar

దేశవ్యాప్తంగా టీనేజర్లకు వ్యాక్సినేషన్ కార్యక్రమం చురుగ్గా సాగుతోంది. ప్రతి రోజు లక్షలాదిమందికి టీకాలు ఇస్తున్నారు. అయితే, బీహార్‌లో మాత్రం వ్యాక్సినేషన్ సిబ్బంది పొరపాటుతో కలకలం రేగింది. 15-18 ఏళ్ల టీనేజర్లకు కొవాగ్జిన్ టీకా వేస్తుండగా నలంద జిల్లాలో మాత్రం సిబ్బంది పొరపాటున కొవిషీల్డ్ టీకా ఇచ్చారు. టీకా కోసం కేంద్రానికి వెళ్లిన సోదరులు కిశోర్ పీయూష్ రంజన్, ఆర్యన్ కిరణ్‌‌లకు సిబ్బంది టీకాలు వేశారు.

అయితే, తమకు ఇచ్చింది కొవాగ్జిన్ కాదని, కొవిషీల్డ్ అని గుర్తించిన వారు విషయాన్ని తండ్రి ప్రియరంజన్ దృష్టికి తీసుకెళ్లారు. దీంతో ఆయన సిబ్బందిని నిలదీశారు. కుమారులకు కొవిషీల్డ్ టీకా ఇచ్చినప్పటికీ ధ్రువీకరణ పత్రంలో మాత్రం కొవాగ్జిన్‌గానే పేర్కొనడంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన ఆయన ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశారు. దీనిని తీవ్రమైన పొరపాటుగా పరిగణించిన ఉన్నతాధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరించిన సిబ్బందిని సస్పెండ్ చేశారు.

More Telugu News