Dharmana Krishna Das: జగన్ మళ్లీ ముఖ్యమంత్రి కాకుంటే రాజకీయాల నుంచి తప్పుకుంటా: డిప్యూటీ సీఎం ధర్మాన కృష్ణదాస్ సవాల్

YS Jagan will also Become CM next time also said dharmana krishna das
  • భగవంతుడు తోడుండబట్టే గత ఎన్నికల్లో గెలిచాం
  • జగన్ కోసం ప్రాణాలిచ్చే నాయకులు ఉన్నారు
  • వేడి నీళ్లు పోస్తే ఇల్లు కాలదు.. దానికి అగ్గిపుల్ల కావాలంటూ టీడీపీ నేతలపై ఫైర్
  • కరోనా లేకుంటే అభివృద్దిలో శ్రీకాకుళం పరుగులు పెట్టేదన్న స్పీకర్ తమ్మినేని
ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి వచ్చే ఎన్నికల్లోనూ గెలిచి మళ్లీ సీఎం పీఠాన్ని అధిష్ఠిస్తారని ఏపీ డిప్యూటీ సీఎం దర్మాన కృష్ణదాస్ ధీమా వ్యక్తం చేశారు. అదే కనుక జరగకుంటే తాను రాజకీయాల నుంచి వైదొలగుతానని సవాలు విసిరారు. శ్రీకాకుళంలో నిన్న డ్వాక్రా బజార్ ప్రారంభోత్సవంలో పాల్గొన్న ధర్మాన మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు.

భగవంతుడెప్పుడూ మంచి వాళ్లకు తోడుంటాడని, అందుకనే గత ఎన్నికల్లో వైసీపీని గెలిపించారని పేర్కొన్నారు. జగన్ కోసం ప్రాణాలు ఇచ్చే నాయకులు ఉన్నారని అన్నారు. ఈ సందర్భంగా ఆయన టీడీపీపై మండిపడ్డారు. వైసీపీలో విభేదాలు రచ్చకెక్కాయని ఆ పార్టీ నేతలు ప్రచారం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేసిన ధర్మాన.. వేడినీళ్లు పోస్తే ఇల్లు కాలదని, దానికి అగ్గిపుల్ల కావాలని అన్నారు. తమ నాయకుడు జగన్‌మోహన్‌రెడ్డి మాత్రమేనని స్పష్టం చేశారు. తమది సమష్టి కుటుంబమని, ప్రజలు, మహిళలు, అధికారుల సహకారంతో మళ్లీ అధికారంలోకి వస్తామని జోస్యం చెప్పారు.

స్పీకర్ తమ్మినేని సీతారాం మాట్లాడుతూ.. కరోనా కనుక లేకుంటే శ్రీకాకుళం జిల్లాతోపాటు రాష్ట్రం మొత్తం అభివృద్ధిలో రథంలా పరుగులు పెట్టేదని అన్నారు. ఓటీఎస్ ఎంతో మంచి పథకమని, కానీ దానిని టీడీపీ విమర్శిస్తోందని దుయ్యబట్టారు.
Dharmana Krishna Das
Tammineni Sitaram
Srikakulam
YSRCP
YS Jagan

More Telugu News