Cricket: కోహ్లీకి బదులు రాహులే బెటర్ ఆప్షన్.. టీమిండియా కెప్టెన్సీ విషయంలో లాజిక్ చెప్పిన పాక్ మాజీ కెప్టెన్

Right Decision To Give Captaincy To Rahul than Kohli Says Salman Butt
  • వైస్ కెప్టెన్ అయిన రాహుల్ కు ఇవ్వడం సరైన నిర్ణయమన్న సల్మాన్ భట్
  • భవిష్యత్ కెప్టెన్ గా అతడికే అవకాశం
  • ఐపీఎల్ లో రాహుల్ నిరూపించుకున్నాడు
  • టీమిండియా కెప్టెన్ గానూ నిరూపించుకుంటాడు
  • ఎంఎస్ ధోనీ హయాం నుంచి జరుగుతున్నదిదే
  • యువతను టీమిండియా ప్రోత్సహిస్తుందని కామెంట్
దక్షిణాఫ్రికాతో వన్డేలకు కూడా రోహిత్ శర్మ దూరమైన సంగతి తెలిసిందే. దీంతో కేఎల్ రాహుల్ ను కెప్టెన్ గా ప్రకటించింది బీసీసీఐ. ఆ నిర్ణయం సరైందేనని పాకిస్థాన్ మాజీ కెప్టెన్, డాషింగ్ ఓపెనర్  సల్మాన్ భట్ అన్నాడు. దాని వెనకున్న లాజిక్ ను కూడా చెప్పుకొచ్చాడు. కోహ్లీ స్థానంలో రోహిత్ శర్మను కెప్టెన్ ను చేశారని, వైస్ కెప్టెన్ గా రాహుల్ కు అవకాశం ఇచ్చారని గుర్తు చేశాడు. ఈ నేపథ్యంలో రోహిత్ గైర్హాజరీతో.. భవిష్యత్ కెప్టెన్సీని దృష్టిలో ఉంచుకుని వైస్ కెప్టెన్ అయిన రాహుల్ కు అవకాశం ఇవ్వడమే మంచిదన్నాడు.

‘‘విరాట్ కోహ్లీ ఇక ఏమాత్రమూ టీమ్ ను నడిపించడు. కాబట్టి వైస్ కెప్టెన్ కే ఆ అవకాశం దక్కాలి. అదే భారత్ టీం మేనేజ్ మెంట్ చేసింది. ఇప్పటికే ఐపీఎల్ లో అతడు నిరూపించుకున్నాడు. భవిష్యత్ లో టీం కెప్టెన్ గానూ అతడు నిరూపించుకుంటాడు’’ అని యూట్యూబ్ చానెల్ లో ఓ అభిమాని అడిగిన ప్రశ్నకు బదులిచ్చాడు.

టీమిండియాలో గత కొన్నేళ్లుగా జరుగుతున్న విధానం ఇదేనని గుర్తు చేశాడు. యువ ఆటగాళ్లను కెప్టెన్లుగా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తున్నారన్నాడు. ఎంఎస్ ధోనీ కెప్టెన్సీ నుంచే ఈ ట్రెండ్ మొదలైందని పేర్కొన్నాడు. బలహీన జట్ల మీద ఆడేటప్పుడు కోహ్లీ, ఇతర యువ ఆటగాళ్లకు కెప్టెన్లుగా అవకాశం ఇచ్చిన విషయాన్ని గుర్తు చేశాడు. అవకాశం ఉన్న ప్రతిసారీ టీమిండియా మేనేజ్ మెంట్ యువకులను ప్రోత్సహిస్తుంటుందని చెప్పాడు. కాబట్టి ఇప్పుడు కేఎల్ రాహుల్ కు ఇది మంచి అవకాశమని తెలిపాడు.

కాగా తొలి రెండు వన్డేలు పార్ల్ లోని బోలండ్ స్టేడియంలో ఈ నెల 19, 21వ తేదీల్లో జరగనున్నాయి. మూడో వన్డే జొహెన్నస్ బర్గ్ లోని వాండరర్స్ స్టేడియంలో జనవరి 23న జరుగుతుంది. రేపట్నుంచి ఇదే స్టేడియంలో రెండో టెస్ట్ మొదలుకానుంది.
Cricket
Team India
Pakistan
Virat Kohli
KL Rahul
Salman Butt

More Telugu News