WhatsApp: భారత యూజర్లకు వాట్సాప్ షాక్.. 17 లక్షలకు పైగా ఖాతాలపై నిషేధం

WhatsApp banned 17 lakh plus Indian accounts in November
  • 2021 నవంబర్ నెల నివేదిక విడుదల
  • యూజర్ల నుంచి ఫిర్యాదులు
  • సొంత టీమ్ ఆధారంగా గుర్తించి చర్యలు
భారత్ లో పెద్ద సంఖ్యలో యూజర్ల ఖాతాలపై వాట్సాప్ నిషేధం విధించింది. 2021 నవంబర్ నెలకు సంబంధించి యూజర్ల భద్రతా నివేదికను విడుదల చేసింది. నవంబర్ లో 17,59,000 ఖాతాలను నిషేధించినట్టు అందులో పేర్కొంది. యూజర్ల ఫిర్యాదులు, వాటిపై తీసుకున్న చర్యల వివరాలను ఈ నివేదికలో వెల్లడించింది.

యూజర్ల నుంచి వచ్చిన ఫిర్యాదుల ఆధారంగానే కాకుండా.. వాట్సాప్ టీమ్ స్వయంగా ప్లాట్ ఫామ్ సేవలను దుర్వినియోగం చేస్తున్న వారిని గుర్తించేందుకు పర్యవేక్షణ కొనసాగిస్తుంటుంది. యూజర్ల నుంచి వచ్చిన ఫిర్యాదులు, నెగెటివ్ ఫీడ్ బ్యాక్ ఆధారంగా చర్యలు తీసుకుంటుంది. దుర్వినియోగాన్ని గుర్తించేందుకు వాట్సాప్ లో మూడంచెల వ్యవస్థ ఉంటుంది. రిజిస్ట్రేషన్ సమయంలో, మెస్సేజ్ చేస్తున్న సమయంలో, నెగెటివ్ ఫీడ్ బ్యాక్ లకు స్పందించడం ఆధారంగా ఖాతాలను గుర్తించి చర్యలు చేపడుతుంది.

స్పామ్ లేదా దుర్వినియోగం, మోసపూరిత ఖాతాలని భావిస్తే తమకు తెలియజేయాలని యూజర్లను వాట్సాప్ కోరుతుంటుంది. గుర్తు తెలియని నంబర్ నుంచి సందేశం అందుకున్న సమయంలో రిపోర్ట్ చేయమని అడుగుతుంది. అంతేకాకుండా ఆయా ఖాతాలను బ్లాక్ చేసుకునే ఆప్షన్ కూడా ఇస్తుంది. వాట్సాప్ ను ఉపయోగించుకొని అపరిచిత నంబర్ల ద్వారా సైబర్ నేరగాళ్లు ఇటీవలి కాలంలో పేట్రేగిపోతుండడం తెలిసిందే.
WhatsApp
banned
user accounts
india

More Telugu News