Indore: చిక్కుల్లో బాలీవుడ్ నటుడు విక్కీ కౌశల్.. ఇండోర్ యువకుడి ఫిర్యాదుపై కేసు నమోదు!

Indore resident files complaint against bollywood star Vicky Kaushal
  • ఇండోర్‌లో సినిమా షూటింగ్
  • బైక్‌పై సారా అలీఖాన్‌తో కలిసి వీధుల్లో చక్కర్లు
  • ఆ బైక్‌కు తన నంబరు ప్లేటు ఉపయోగించారని ఫిర్యాదు
  • దర్యాప్తు ప్రారంభించిన పోలీసులు
బాలీవుడ్ నటుడు, ఇటీవల నటి కత్రినా కైఫ్‌ను పెళ్లాడిన విక్కీ కౌశల్‌పై మధ్యప్రదేశ్ యువకుడు కేసు పెట్టాడు. వీక్కీ కౌశల్ తన రాబోయే సినిమా షూటింగులో భాగంగా ఇండోర్ వీధుల్లో నటి సారా అలీఖాన్‌తో కలిసి బైక్‌పై చక్కర్లు కొట్టాడు. అయితే, విక్కీ నడిపిన బైక్‌కు ఉపయోగించిన నంబరు తనదేనని, తన అనుమతి లేకుండా నంబరును ఉపయోగించడం నేరమంటూ ఇండోర్‌కు చెందిన జై సింగ్ యాదవ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు.

‘‘విక్కీ కౌశల్ నడిపిన బైక్‌‌కు నా నంబరు ఉపయోగించారు. ఒకరి నంబరును వారి అనుమతి లేకుండా వినియోగించడం నేరమని చిత్ర బృందానికి తెలుసో, లేదో నాకు తెలియదు. వారు నా అనుమతి లేకుండా నా నంబరు ప్లేటు ఉపయోగించడం తప్పు. ఈ విషయమై పోలీసులకు ఫిర్యాదు చేశాను. పోలీసులు చర్యలు తీసుకుంటారు’’ అని జైసింగ్ తెలిపారు. తన బైక్ నంబరు ప్లేటును సోషల్ మీడియాలో షేర్ చేశారు.

దీనిపై స్పందించిన పోలీసులు.. తమకు ఫిర్యాదు అందిందని, నంబరు ప్లేటును అక్రమంగా ఉపయోగించినట్టు తేలితే మోటారు వాహనాల చట్టంలోని నిబంధనల ప్రకారం చర్యలు తీసుకుంటామని చెప్పారు. సినిమా యూనిట్ ఇంకా ఇండోర్‌లోనే ఉందని, వారిని విచారించేందుకు ప్రయత్నిస్తామని పేర్కొన్నారు. కాగా, విక్కీ కౌశల్, సారా అలీఖాన్ ఇండోర్‌లో బైక్‌పై చక్కర్లు కొడుతున్న వీడియోలు, ఫొటోలు సోషల్ మీడియాను ముంచెత్తుతున్నాయి.
Indore
Madhya Pradesh
Bollywood
Vicky Kaushal
Sara Ali Khan

More Telugu News