Tammineni Sitaram: చంద్రబాబు ప్రజల విశ్వాసం కోల్పోయారు: ఏపీ స్పీకర్ తమ్మినేని సీతారాం

Speaker Tammineni Sitharam comments on Chandrababu
  • అధికారంలో ఉన్నప్పుడు ఏం చేశారంటూ నిలదీత
  • మరో మూడు పర్యాయాలు జగనే సీఎం అన్న స్పీకర్
  • చంద్రబాబును ప్రజలు తిరస్కరించారన్న సజ్జల 
  • మేనిఫెస్టో అమలుకు జగన్ చిత్తశుద్ధితో కృషి చేస్తున్నారంటూ ప్రశంసలు  

ఏపీ అసెంబ్లీ స్పీకర్ తమ్మినేని సీతారాం టీడీపీ అగ్రనేతలపై విమర్శలు చేశారు. చంద్రబాబు ప్రజల విశ్వాసం కోల్పోయారని వ్యాఖ్యానించారు. చంద్రబాబు వల్ల టీడీపీ మీదనే కాకుండా, రాజకీయ వ్యవస్థ మీదే ప్రజలకు నమ్మకం పోయిందని అన్నారు. అధికారంలో ఉన్నప్పుడు శ్రీకాకుళం జిల్లాకు ఏం చేశారో అచ్చెన్నాయుడు చెప్పాలని నిలదీశారు. రాష్ట్రంలో ప్రజలు సీఎం జగన్ పై నమ్మకంతో ఉన్నారని, మరో రెండు, మూడు పర్యాయాలు జగనే సీఎం అవుతారని ధీమా వ్యక్తం చేశారు.

చంద్రబాబు పాలనను ప్రజలు తిరస్కరించారు: సజ్జల

ఏపీ ప్రభుత్వ సలహాదారు, వైసీపీ రాష్ట్ర కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి ప్రజలకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా మాజీ సీఎం చంద్రబాబుపై వ్యాఖ్యలు చేశారు. రాష్ట్ర విభజన తర్వాత చంద్రబాబు పాలన చూసిన ప్రజలు, ఐదేళ్ల తర్వాత ఆయనను తిరస్కరించారని వెల్లడించారు.

సీఎం జగన్ అధికారంలోకి వచ్చేనాటికి టీడీపీ సర్కారు తీవ్ర అప్పుల భారాన్ని మిగిల్చిపోయిందని, ఆ తర్వాత కరోనా కూడా రాష్ట్రాన్ని దెబ్బతీసిందని అన్నారు. అయినప్పటికీ, సీఎం జగన్ సవాళ్లను దీటుగా ఎదుర్కొని మేనిఫెస్టో అమలుకు చిత్తశుద్ధితో కృషి చేస్తున్నారని కొనియాడారు. దేశంలో మరెక్కడా లేని విధంగా వలంటీర్ వ్యవస్థ, గ్రామ/వార్డు సచివాలయాలు తీసుకువచ్చి పథకాలు అమలు చేస్తున్నారని కీర్తించారు.

  • Loading...

More Telugu News