emerald: రూ.500 కోట్ల అరుదైన శివలింగం.. బ్యాంకు లాకర్ నుంచి స్వాధీనం

  • తంజావూర్ లో వెలుగులోకి
  • 530 గ్రాములు, 8 సెంటీమీటర్ల ఎత్తు
  • జెమ్నాలజిస్టులతో నిర్ధారించుకున్న పోలీసులు
Emerald lingam worth Rs 500 crore recovered from Thanjavur man

ఎంతో విలువైన, పురాతన మరకత శివలింగం తమిళనాడులోని తంజావూరులో వెలుగు చూసింది. దీని విలువ రూ.500 కోట్లు ఉంటుందని భావిస్తున్నారు. ఇందుకు సంబంధించిన వివరాలను ఏడీజీపీ కె.జయంత్ మురళి చెన్నైలో మీడియాకు వెల్లడించారు.

పోలీసుల ప్రత్యేక బృందాలు తంజావూరులోని అరుళనంద నగర్ లో గురువారం సోదాలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఎన్ఎస్ అరుణ్ అనే వ్యక్తిని ప్రశ్నించగా తన తండ్రి బ్యాంకు లాకర్ లో శివలింగాన్ని ఉంచినట్టు బయటపెట్టాడు. ఈ సమాచారం ఆధారంగా బ్యాంకు లాకర్ లోని మరకత శివలింగాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
 
530 గ్రాముల బరువు, 8 సెంటీమీటర్ల ఎత్తు ఉన్న దీనిని పురాతనమైనదిగా అరుణ్ పోలీసులకు తెలిపాడు. జెమ్నాలజిస్టులు దీని విలువ రూ.500 కోట్లు ఉంటుందని నిర్ధారించినట్టు ఏడీజీపీ కె.జయంత్ వెల్లడించారు. ఇక ఇది ఏ ఆలయానికి సంబంధించిందో విచారణలో తేలాల్సి ఉందన్నారు. 2016లో నాగపట్టణంలోని తిరుకువలాయ్ శివాలయం నుంచి కనిపించకుండా పోయిన శివలింగం ఇదేనా, కాదా? అని కూడా పోలీసులు విచారణ చేయనున్నారు.

More Telugu News