టెలికం రంగంలో చౌక ధరల యుగం ముగిసినట్టే.. న్యూ ఇయర్‌లో మరో బాదుడుకు రెడీ!

01-01-2022 Sat 10:09
  • గతేడాది ప్రీపెయిడ్ టారిఫ్‌లను పెంచిన కంపెనీలు
  • ఇప్పుడు పోస్టుపెయిడ్ టారిఫ్‌లు పెంచే యోచన
  • ధరలు పెరిగినా చందాదారులు మారిపోతారన్న భయం నిల్
  • 5 స్పెక్ట్రం వేలం తర్వాత ధరల పెంపుపై నిర్ణయం
  • టెలికం కంపెనీలపై రూ. 4.7 లక్షల కోట్ల అప్పుల భారం
Mobile Tariffs to Hike in New Year Companies to rise post paid tariffs
కొత్త ఏడాదిలోకి సంతోషంగా అడుగుపెట్టిన వినియోగదారులకు భారీ షాకిచ్చేందుకు మొబైల్ కంపెనీలు సిద్ధమయ్యాయి. ప్రీపెయిడ్ టారిఫ్ ధరలను ఇటీవల 20 నుంచి 25 శాతానికి పెంచి వినియోగదారులకు షాకిచ్చిన టెలికం కంపెనీలు ఈ ఏడాది కూడా అదే బాటన నడవనున్నట్టు తెలుస్తోంది. దీంతో ఇక చౌక ధరల యుగం ముగిసినట్టేనని టెలికం నిపుణులు చెబుతున్నారు. గతేడాది ప్రీపెయిడ్ వినియోగదారుల జేబులు గుల్ల చేసిన కంపెనీలు ఈ ఏడాది పోస్టు పెయిడ్ యూజర్లపై పడేందుకు సిద్ధమయ్యాయి.

ఈ నేపథ్యంలో ట్రాయ్ కనుక 5జీ స్పెక్ట్రమ్ వేలం ధరను ఖరారు చేశాక ధరల పెంపుపై నిర్ణయం తీసుకోవాలని భావిస్తున్నట్టు తెలుస్తోంది. అంతేకాదు, ధరలు పెంచినా వినియోగదారులను కోల్పోతామన్న భయం కంపెనీలకు లేదు. ఎందుకంటే, పోస్టుపెయిడ్ చందాదారులు వేరే నెట్‌వర్క్‌కు అంత త్వరగా నంబర్‌పోర్టబిలిటీ చేసుకోవడం సాధ్యం కాదు. కాబట్టి ధరలు పెంచినా యూజర్లను కోల్పోతామన్న భయం కంపెనీలకు లేదని నిపుణులు చెబుతున్నారు. అయితే, ప్రీపెయిడ్ కస్టమర్లు మాత్రం నంబర్‌పోర్టబిలిటీ చేసుకునే అవకాశం ఉంది.

 టెలికం కంపెనీల రాబడిలో పోస్టు పెయిడ్ వినియోగదారులదే కీలక పాత్ర. వారి యాక్టివ్ సబ్‌స్క్రైబర్లలో 5 శాతం పోస్టుపెయిడ్ కస్టమర్లే. పోస్టుపెయిడ్ సెగ్మెంట్ నుంచే 15 శాతం ఆదాయం వస్తోంది. వీరిలో 50-60 శాతం మంది ఎంటర్‌ప్రైజ్ కస్టమర్లు కాగా, 34 శాతం మంది యూజర్లు దేశంలోని మూడు ప్రధాన నగరాల నుంచే ఉండడం గమనార్హం. 36 శాతం మంది సబ్‌స్క్రైబర్లు ఎ-సర్కిల్‌కు చెందినవారు. పోస్టుపెయిడ్ యూజర్ల పరంగా చూస్తే 43 శాతం వాటాతో వొడాఫోన్ ఐడియా అగ్రస్థానంలో కొనసాగుతోంది. భారతీ ఎయిర్‌టెల్ 28 శాతం కలిగి ఉంది.

నిజానికి టెలికం రంగంలో విపరీతమైన పోటీ ఉన్న మన దేశంలో మొబైల్ టారిఫ్ చవగ్గానే ఉంది. ఈ కారణంగా ఆయా కంపెనీలు నష్టాలను భరించాల్సి వస్తోంది. ఇప్పటికే ఈ రంగంపై రూ. 4.7 లక్షల కోట్ల అప్పుల భారం ఉంది. ఈ నేపథ్యంలో టెలికం కంపెనీలకు ప్రభుత్వం బెయిలవుట్ ప్యాకేజీలు ఇవ్వాల్సి వచ్చింది. తమ ఆర్థిక పరిస్థితిని మెరుగుపర్చుకునేందుకు ఇప్పటికే ప్రీపెయిడ్ టారిఫ్‌లను పెంచేసిన కంపెనీలు ఇప్పుడు పోస్టుపోయిడ్ వినియోగదారులపై దృష్టిసారించాయి.