తిరుమల శ్రీవారిని దర్శించుకున్న సాయికుమార్.. సినిమా టికెట్ల వివాదంపై స్పందన

01-01-2022 Sat 09:15
  • స్వామివారిని దర్శించుకున్న అనిల్ రావిపూడి, కంగనా రనౌత్
  • టికెట్లు అందరికీ అందుబాటు ధరల్లో ఉండాలన్న సాయికుమార్
  • ఈ ఏడాది పలు సినిమాల్లో నటిస్తున్నట్టు వెల్లడి
Tollywood actor sai kumar director anil ravipudi and bollywood actress kangana visits tirumala
టాలీవుడ్ ప్రముఖ నటుడు సాయికుమార్ ఈ ఉదయం కుటుంబ సభ్యులతో కలిసి తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. వీఐపీ బ్రేక్ ప్రారంభ దర్శన సమయంలో స్వామి వారిని దర్శించుకున్న అనంతరం రంగనాయకుల మండపంలో వేదపండితులు వారికి ఆశీర్వచనాలు పలికారు. స్వామివారి వస్త్రంతో సత్కరించి తీర్థ ప్రసాదాలు అందజేశారు. ఈ సందర్భంగా సాయికుమార్ మాట్లాడుతూ.. సినీ పరిశ్రమలో అడుగుపెట్టి ఈ ఏడాదికి 50 ఏళ్లు పూర్తవుతాయని చెప్పారు.

ఈ ఏడాది తాను పలు భాషల చిత్రాల్లో నటిస్తున్నట్టు చెప్పిన ఆయన.. ఏపీలో కొనసాగుతున్న సినిమా టికెట్ల వివాదంపై స్పందించారు. టికెట్ల ధర నిర్ణయంపై ప్రభుత్వం కమిటీ వేసిందని, వర్చువల్‌గా సమావేశం కూడా జరిగిందని పేర్కొన్నారు. టికెట్ ధరలు అందరికీ అందుబాటులో ఉండాలన్న సాయికుమార్.. త్వరలోనే ఈ సమస్య పరిష్కారం అవుతుందన్నారు. కాగా, టాలీవుడ్ ప్రముఖ దర్శకుడు అనిల్ రావిపూడి, బాలీవుడ్ నటి కంగనా రనౌత్ కూడా స్వామి వారిని దర్శించుకున్నారు.