Raghu Rama Krishna Raju: రుణాల ఎగవేత కేసు.. ఎంపీ రఘురామ కృష్ణరాజుపై సీబీఐ చార్జ్‌షీట్ దాఖలు

CBI Files Charge sheet against ycp mp Raghurama krishna raju
  • విద్యుత్ సంస్థను నెలకొల్పుతామంటూ కన్సార్షియం నుంచి రూ. 974.71 కోట్ల రుణాలు
  • తీసుకున్న నిధులను ఫిక్స్‌డ్ డిపాజిట్లుగా మళ్లింపు
  • రఘురామరాజు సహా 16 మంది చార్జ్‌షీట్
రుణాల ఎగవేత కేసులో నరసాపురం ఎంపీ రఘురామకృష్ణరాజు సహా 16 మందిపై సీబీఐ చార్జ్‌షీట్ దాఖలు చేసింది. ఢిల్లీలోని రోజ్ అవెన్యూ కోర్టుల సముదాయంలోని సీబీఐ కేసుల ప్రత్యేక న్యాయస్థానంలో ప్రత్యేక న్యాయమూర్తి ఎదుట చార్జ్‌షీట్ దాఖలు చేసినట్టు సీబీఐ తెలిపింది.

ఈ కేసు పూర్వాపరాల్లోకి వెళ్తే.. రఘురామకృష్ణరాజు చైర్మన్‌గా ఉన్న ఇండ్ భారత్ కంపెనీ తమిళనాడులోని ట్యటికోరిన్‌లో థర్మల్ విద్యుదుత్పత్తి సంస్థను నెలకొల్పుతామని చెబుతూ పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ లిమిటెడ్ (పీఎఫ్‌సీ) ఆధ్వర్యంలోని రూరల్ ఎలక్ట్రిఫికేషన్ కార్పొరేషన్ లిమిటెడ్ (ఆర్‌ఈసీ), ఇండియా ఇన్‌‌ఫ్రాస్ట్రక్చర్ ఫైనాన్స్ కంపెనీ లిమిటెడ్ (ఐఐఎఫ్‌సీఎల్)తో కూడిన కన్సార్షియం నుంచి రూ. 974.71 కోట్ల రుణం తీసుకుంది.

రుణం తీసుకున్నప్పటికీ కంపెనీని మాత్రం పూర్తి చేయలేదు సరికదా, రుణ ఒప్పంద నిబంధనలు కూడా పాటించలేదు. తీసుకున్న రుణాలను బ్యాంక్ ఆఫ్ ఇండియా, యూకో బ్యాంకులకు ఫిక్స్‌డ్ డిపాజిట్ల రూపంలో మళ్లించడంతోపాటు గ్రూపు పరిధిలోని ఇతర కంపెనీల కాంట్రాక్టర్లకు అడ్వాన్సులు చెల్లించారు. తీసుకున్న రుణాలను చెల్లించకపోవడంతో కన్సార్షియం రూ.947.71 కోట్లను నష్టపోయింది.

ఈ క్రమంలో 3 అక్టోబరు 2018న హైదరాబాద్‌కు చెందిన ఓ ప్రైవేటు కంపెనీ, దాని డైరెక్టర్లపై ఢిల్లీలోని ఈవోడబ్ల్యూ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైంది. కేంద్రం ఆదేశాలతో ఆ సంస్థపై 29 ఏప్రిల్ 2019న సీబీఐ కేసు నమోదు చేసింది. విచారణలో ఈ విషయాలు వెలుగులోకి వచ్చాయి. తాజాగా రఘురామకృష్ణరాజు, ఆయన కంపెనీ, అనుబంధ కంపెనీలు, కాంట్రాక్టర్లు, చార్టెడ్ అకౌంటెంట్లు కలిపి మొత్తం 16 మందిపై చార్జ్‌షీట్ దాఖలు చేసింది.
Raghu Rama Krishna Raju
CBI
Debit Evasion
MP

More Telugu News