Somu Veerraju: నేను 'సారాయి వీర్రాజు' కాదు.. బియ్యం వీర్రాజుని, సిమెంటు వీర్రాజుని: సోము వీర్రాజు

somu veerraju slams on ycp
  • సామాజిక మాధ్య‌మాల్లో సారాయి వీర్రాజు అంటూ కొంద‌రు సెటైర్లు
  • రూ.50కు లిక్కర్ అమ్మితే పేదకుటుంబాల‌కు మేలు
  • ఏడాదికి 2 లక్షల రూపాయలు మిగులుతాయన్న సోము వీర్రాజు
  • తాను చేస్తున్న ప్రతి వ్యాఖ్య 2024లో మ్యానిఫెస్టోలో పెడతామ‌ని హామీ

ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో తమ పార్టీ అధికారంలోకి వస్తే రూ.50కే నాణ్యమైన క్వార్టర్ మద్యాన్ని ఇస్తామంటూ బీజేపీ ఆంధ్ర‌ప్ర‌దేశ్ అధ్య‌క్షుడు సోము వీర్రాజు చేసిన వ్యాఖ్య‌లపై విమ‌ర్శ‌ల జ‌ల్లు కురిసిన విష‌యం తెలిసిందే. అయిన‌ప్ప‌టికీ సోము వీర్రాజు త‌న మాట‌మీదే క‌ట్టుబ‌డి ఉంటున్నారు. ఆయ‌న‌పై సామాజిక మాధ్య‌మాల్లో 'సారాయి వీర్రాజు', 'అయ్య‌య్యో వ‌ద్ద‌మ్మా', 'మందు కావాలా నాయ‌నా' అంటూ నెటిజ‌న్లు మీమ్స్ సృష్టిస్తూ హ‌ల్‌చ‌ల్ చేస్తున్నారు.

దీంతో సోము వీర్రాజు తాను చేసిన వ్యాఖ్య‌ల‌పై ఈ రోజు మ‌రోసారి స్పందించారు. ''50 రూపాయలకు లిక్కర్ అమ్మితే ప్రతి పేదకుటుంబానికి ఏడాదికి 2 లక్షల రూపాయలు మిగులుతాయి.. నేను సారాయి వీర్రాజు కాదు.. బియ్యం వీర్రాజుని, సిమెంటు వీర్రాజుని, కోడిగుడ్ల వీర్రాజుని.. నేను చేస్తున్న ప్రతి వ్యాఖ్య 2024లో బీజేపీ మ్యానిఫెస్టోలో పెడతాం'' అని సోము వీర్రాజు అన్నారు.

మ‌రోవైపు, విశాఖలో కేజీహెచ్ ఆసుప‌త్రి పేరు వెంటనే మార్చాలని సోము వీర్రాజు డిమాండ్ చేశారు. అసలు కింగ్ జార్జ్ ఎవరని, ఇందులో కింగ్ ఎవరని? జార్జ్ ఎవరు? అని ఆయ‌న ప్ర‌శ్నించారు. వెంటనే ఈ పేరు మార్చాలని ఆయ‌న‌ డిమాండ్ చేశారు. కేజీహెచ్‌కు సర్దార్ గౌతులచ్చన్న పేరు పెట్టాల‌ని ఆయ‌న అన్నారు. త్యాగశీలుర పేర్లు పెట్టాలన్నారు. మ‌రోవైపు గుంటూరులో జిన్నా టవర్ పేరు ఎందుకు ఉంద‌ని కూడా బీజేపీ విమ‌ర్శ‌లు గుప్పిస్తోన్న విష‌యం తెలిసిందే.

మ‌న క‌ట్ట‌డాల‌కు మ‌న‌వాళ్ల పేరు పెట్టుకోవాల‌ని ఆయ‌న సూచించారు. మ‌న వాళ్ల పేరు పెట్టుకుంటే మ‌న ప్ర‌జ‌ల‌కు వారి చ‌రిత్ర తెలుస్తుంద‌ని అన్నారు. దేశంలో, రాష్ట్రంలో కుటుంబ పార్టీల‌కు ప‌రిపాలించే అవ‌కాశాన్ని ప్ర‌జ‌లు ఇవ్వ‌కూడ‌ద‌ని చెప్పారు. కుటుంబ రాజ‌కీయాల‌తో న‌ష్ట‌మే త‌ప్ప లాభాలు ఏమీ ఉండ‌వ‌ని సోము వీర్రాజు తెలిపారు.

  • Loading...

More Telugu News