omicron cases: ఆసియా దేశాల్లో కట్టడిలోనే ఒమిక్రాన్..!

  • వందలు, వేలల్లోనే ఒమిక్రాన్ కేసులు
  • కానీ వ్యాప్తి వేగవంతమైందంటున్న నిపుణులు
  • వైరస్ ప్రభావం తక్కువే
  • వచ్చే కొన్ని నెలలు కీలకం
Asia keeps omicron at bay but a surge may be inevitable

పాశ్చాత్య దేశాలైన అమెరికా, బ్రిటన్, యూరోప్ దేశాలను కరోనా ఒమిక్రాన్ వణికిస్తోంది. నిత్యం లక్షలాది కేసులు నమోదవుతున్నాయి. తొలుత వెలుగు చూసిన దక్షిణాఫ్రికాలోనూ కొత్త కేసులు భారీగానే వెలుగు చూస్తున్నాయి. కరోనా మొదటి రెండు విడతల్లో ఆసియా దేశాల్లో కేసులు, మరణాలు గణనీయంగా నమోదవడాన్ని చూశాం. కానీ, ఈ విడత ఒమిక్రాన్ కేసులు ఆసియాలో ఇప్పటి వరకైతే అదుపులోనే ఉన్నాయని చెప్పుకోవాలి.  

విదేశాల నుంచి వచ్చే వారికి కఠినమైన క్వారంటైన్ నిబంధనలు, మాస్క్ ధరించడం కేసుల కట్టడికి సాయపడినట్టు భావిస్తున్నారు. కరోనా పూర్వపు వేరియంట్లతో పోలిస్తే ఒమిక్రాన్ ఎన్నో రెట్లు అధికంగా వ్యాప్తి చెందుతుందని దీని ప్రభావం ఉన్న దేశాలను చూస్తే తెలుస్తోంది.  అందుకే ఆసియా దేశాలు ముందు నుంచే జాగ్రత్తగా వ్యవహరిస్తున్నాయి.

జపాన్, దక్షిణ కొరియా, థాయిలాండ్ క్వారంటైన్ నిబంధనలను కఠినంగా అమలు చేస్తున్నాయి. విమాన ప్రయాణికులు అందరికీ పరీక్షలు నిర్వహిస్తున్నాయి. అయినప్పటికీ కేసులు క్రమంగా పెరుగుతుండడంతో వచ్చే కొన్ని నెలలు కీలకమైనదిగా నిపుణులు భావిస్తున్నారు. ఒక్కసారి వేగాన్ని అందుకుంటే అది మరింత వేగంగా వ్యాప్తిలోకి వెళ్లొచ్చని జపాన్ ప్రభుత్వ వైద్య సలహాదారు షిగేరు ఓమి అన్నారు. ఒమిక్రాన్ స్వల్ప స్థాయి ప్రభావాన్నే చూపిస్తుందని నమ్ముతున్నట్టు చెప్పారు. కానీ, చాలా వేగంగా కేసులు రెట్టింపు అవుతాయన్నారు.

మన దేశంలో ఇప్పటి వరకు ఒమిక్రాన్ కేసులు  1,270కు చేరాయి. వ్యాప్తి తీవ్రత ఎక్కువగా ఉన్న రకం అయినందున.. కేసులు ఇంకా పెరుగుతూ పోతే ఒక స్థాయి తర్వాత మళ్లీ లక్షలాది సంఖ్యకు చేరుకునే పరిస్థితి తలెత్తవచ్చని నిపుణులు అంటున్నారు. ఆస్ట్రేలియాలో కేసులు 32,000కు చేరాయి. చాలా వేగంగా ఒమిక్రాన్ వ్యాప్తి చెందుతోందని అక్కడి ప్రభుత్వ నేత ఒకరు ప్రకటించారు.

థాయిలాండ్ లో కేసుల సంఖ్య 700కు చేరింది. దక్షిణ కొరియా, జపాన్ దేశాల్లో 500 దాటాయి. చైనా 8 ఒమిక్రాన్ కేసులను ప్రకటించింది. ఒక్క కేసు కనిపించినా, ఆ ప్రాంతం మొత్తానికి చైనా పూర్తి లాక్ డౌన్ విధిస్తోంది. బాహ్య ప్రపంచంతో రాకపోకలను తెంపేసి కఠినంగా వ్యవహరిస్తోంది. వచ్చే ఏడాది బీజింగ్ ఒలింపిక్ క్రీడా కార్యక్రమానికి అడ్డు ఉండకూడదని ఇలా చేస్తోంది. మరోపక్క, తైవాన్ ‘మోడెర్నా’ టీకా బూస్టర్ డోసులను తన ప్రజలకు ఇస్తోంది. మూడో డోసు తీసుకోవాలని ప్రజలకు సూచించింది.

  • Loading...

More Telugu News