Yogi Adityanath: మాకు 350 సీట్లకు తక్కువ రావు.. మాఫియా పీడ వదిలించేందుకే రాజకీయాల్లోకి వచ్చా: యోగి ఆదిత్యనాథ్

  • కొన్ని ఘటనలు నన్ను ప్రజాసేవ దిశగా నడిపించాయి
  • మాఫియాను ఇంకెంత మాత్రం ప్రజలు సహించరు
  • భూములను ఆక్రమించుకుంటే బుల్డోజర్లు వస్తాయని నేరస్థులకు తెలుసు
  • ఓ వార్తా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో వెల్లడి
I decided to join politics to help people get rid of mafia Yogi Adityanath

ప్రజలను మాఫియా పీడ నుంచి విముక్తులను చేసేందుకు తాను రాజకీయాల్లోకి వచ్చినట్లు ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ తెలియజేశారు. గోరఖ్ పూర్ మఠాధిపతిగా ఉన్న ఆయన్ను రాజకీయాల వైపు నడిపించిన పరిస్థితులు, యూపీలో తాజా రాజకీయ వాతావరణంపై ఓ వార్తా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో భాగంగా వెల్లడించారు.

‘‘1994-95లో గోరఖ్ పూర్ లో ఒక ప్రముఖ కుటుంబం ఉండేది. వారికి రెండు చారిత్రక భవనాలు ఉన్నాయి. ఆ రెండింటినీ రాష్ట్ర ప్రభుత్వం మాఫియాకు కట్టబెట్టింది. అనంతరం ఆ ప్రముఖ కుటుంబం రెండు భవనాలను నేలమట్టం చేసింది. ఆ కుటుంబాన్ని కలిసి ఏమైందని నేను అడిగినప్పుడు.. ‘ఆ భవనాలను కూల్చకపోతే సర్వం కోల్పోవాల్సి వస్తుంది’ అంటూ సమాధానమొచ్చింది.

గోరఖ్ పూర్ లోనే సంపన్నుడి నుంచి నాకు ఒక రోజు కాల్ వచ్చింది. ఒక మంత్రి తన నివాసాన్ని ఆక్రమించుకున్నట్టు చెప్పాడు. నేను అక్కడికి వెళ్లేసరికి అతడి వస్తువులను బయటకు విసిరేస్తుండడం కనిపించింది. నేను వారిని ప్రతిఘటించే సరికి నా మొహాన పేపర్లను విసిరేశారు. వారికి దేహశుద్ధి చేయాలంటూ అక్కడే ప్రేక్షకుల్లా చూస్తుండిపోయిన ప్రజలకు పిలుపునిచ్చాను. ఇటువంటి ఘటనలు నన్ను రాజకీయాల్లోకి చేరేలా చేశాయి.

ఇప్పుడు యూపీలో ఎవరూ ఈ తరహా చర్యలను ఆమోదించే పరిస్థితి లేదు. భూములను ఆక్రమించుకుంటే బుల్డోజర్లు వస్తాయని నేరగాళ్లు అందరికీ తెలుసు. మాఫియా అంటే మాఫియానే. దాన్ని కులంతో, మతంతో, ప్రాంతంతో ముడిపెట్టవద్దు. ఇది సమాజానికి శత్రువు.

ఉత్తర ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో మాకు 350 సీట్ల కంటే తక్కువ రావని నేను నమ్ముతున్నాను. యూపీలో సాధించిన విజయాలన్నీ కూడా ప్రధాని మోదీ నాయకత్వ స్ఫూర్తితోనే సాధ్యమయ్యాయి’’అని చెప్పారు యోగి.

More Telugu News