COVID19: కరోనా పేషెంట్లు ఇంటి నుంచే ఓటు వేయొచ్చు.. అధికారులే వారింటికి వెళ్లి ఓటేయిస్తారు: కేంద్ర ఎన్నికల సంఘం

Covid Patients Can Cast Their Vote From Home Says CEC Susheel Chandra
  • ఐదు రాష్ట్రాల ఎన్నికలపై సీఈసీ సుశీల్ చంద్ర ప్రెస్ మీట్
  • ఎన్నికల నిర్వహణకే అన్ని పార్టీలు మొగ్గు చూపాయి
  • లక్ష పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేస్తాం
  • యూపీలో 18–19 ఏళ్ల యువ ఓటర్లే ఎక్కువ
  • గత ఎన్నికలతో పోలిస్తే మూడు రెట్ల పెరుగుదల
అన్ని పార్టీలూ ఎన్నికలకే మొగ్గు చూపాయని కేంద్ర ఎన్నికల సంఘం కమిషనర్ సుశీల్ చంద్ర తెలిపారు. ఉత్తరప్రదేశ్, పంజాబ్, ఉత్తరాఖండ్, గోవా, మణిపూర్ ఎన్నికలకు సంబంధించి ఇవాళ ఆయన లక్నోలో మీడియాతో మాట్లాడారు. కరోనా నిబంధనలను పాటిస్తూ ఎన్నికలు నిర్వహించాలంటూ అన్ని రాజకీయ పార్టీలూ కోరాయన్నారు.

ఓటర్ల తుది జాబితాను జనవరి 5న విడుదల చేస్తామని స్పష్టం చేశారు. ఐదు రాష్ట్రాల పోలింగ్ కు సంబంధించి లక్ష పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేస్తామన్నారు. పోలింగ్ ఉదయం 8 నుంచి సాయంత్రం 6 గంటల దాకా జరుగుతుందన్నారు. అన్ని పోలింగ్ బూత్ లలోనూ వీవీ ప్యాట్ లను ఏర్పాటు చేస్తామన్నారు.

ఎన్నికలు జరిగే రాష్ట్రాల్లో కరోనా వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని వేగవంతం చేయాలని సుశీల్ చంద్ర ఆదేశించారు. కరోనా పేషెంట్లు ఇంటి నుంచే ఓటు వేయొచ్చని పేర్కొన్నారు. అధికారులే కరోనా పేషెంట్ల ఇంటికి వెళ్తారని వారి ఓటును నమోదు చేయిస్తారని తెలిపారు. కరోనా కేసులు పెరుగుతుండడంతో ఒక్కో బూత్ లో కేవలం 1,200 ఓటర్లకే అనుమతిస్తామన్నారు. అందుకు అనుగుణంగా యూపీలో 11 వేల కేంద్రాలను పెంచామన్నారు.

ఈ సారి 18 నుంచి 19 ఏళ్ల వయసున్న ఓటర్లే ఎక్కువగా ఉన్నారని సీఈసీ సుశీల్ చంద్ర చెప్పారు. గత ఎన్నికలతో పోలిస్తే ఇప్పుడు మూడు రెట్లు పెరిగారని తెలిపారు. మహిళా ఓటర్ల నిష్పత్తి కూడా 839 నుంచి 868కి పెరిగిందన్నారు.
COVID19
Elections
CEC
Susheel Chandra
Uttar Pradesh
Uttarakhand
Punjab
Manipur
Goa

More Telugu News