Telangana: ప్రతి 5 కిలోమీటర్లకు ఒక చార్జింగ్ స్టేషన్.. ప్రైవేటు సంస్థలకు అనుమతి.. ఈవీల ప్రోత్సాహానికి తెలంగాణ సర్కారు ప్రణాళికలు

  • జాతీయ రహదారులపై 27 కిలోమీటర్లకు ఒక స్టేషన్
  • బీవోటీ విధానంలో ఏర్పాటుకు టెండర్లు
  • అదనంగా 600 ఏర్పాటు యోచన
Telangana Govt allow private ev charging stations

పర్యావరణానికి అనుకూలమైన ఎలక్ట్రిక్ వాహనాలను (ఈవీ) పెద్ద ఎత్తున ప్రోత్సహించేందుకు తెలంగాణ సర్కారు సమాయత్తమవుతోంది. ప్రధానంగా ఈవీల వినియోగం పెరగాలంటే చార్జింగ్ స్టేషన్లు అందుబాటులో ఉండడం అవసరమనే సత్యాన్ని గ్రహించింది. దీంతో చార్జింగ్ స్టేషన్ల ఏర్పాటుకు ప్రైవేటు సంస్థలను అనుమతించే ఆలోచనతో ఉంది. నిర్మించు, నిర్వహించు, బదిలీ చేయి (బీవోటీ) అనే విధానంలో రాష్ట్ర వ్యాప్తంగా చార్జింగ్ స్టేషన్ల ఏర్పాటుకు ప్రైవేటు సంస్థలను అనుమతించే యోచనతో ఉంది.

పట్టణాల్లో అయితే ప్రతి ఐదు కిలోమీటర్లకు ఒకటి, జాతీయ రహదారులపై ప్రతి 27 కిలోమీటర్లకు ఒక చార్జింగ్ స్టేషన్ ఉండాలన్నది సర్కారు ప్రణాళిక. ‘‘రాష్ట్రవ్యాప్తంగా ప్రస్తుతం 138 చార్జింగ్ స్టేషన్లు ఉండగా, అదనంగా 600 ఏర్పాటు చేసేందుకు మార్గదర్శకాలు తయారవుతున్నాయి. ఇందుకు సంబంధించి తెలంగాణ ఎనర్జీ డెవలప్ మెంట్ కార్పొరేషన్ (టీఎస్ఈఆర్డీసీవో) త్వరలోనే టెండర్లకు ఆహ్వానం పలుకుతుంది’’ అని సంస్థ వైస్ చైర్మన్ ఎన్.జానయ్య తెలిపారు.

ఆదాయం పంచుకునే విధానం కింద ప్రైవేటు భూ యజమానులు, పారిశ్రామికవేత్తలు సంయుక్తంగా ఏర్పాటు చేయవచ్చని జానయ్య చెప్పారు. ఇందుకు రాష్ట్ర ప్రభుత్వం నుంచి సహకారం ఉంటుందన్నారు. ఈ ఏడాది మార్చి నెలలో 2,465ఈవీల వాహనాలు విక్రయం కాగా, జూన్ లో 3,800కు పెరిగాయని అధికారులు తెలిపారు. గడిచిన ఆరు నెలల్లో రిజిస్ట్రేషన్ కోసం వచ్చిన ఈవీ దరఖాస్తులు 5,500గా ఉన్నట్టు వెల్లడించారు. పెట్రోల్ ధరలు గణనీయంగా పెరగడం ఈవీల విక్రయాలకు మేలు చేస్తున్నట్టు అభిప్రాయపడుతున్నారు.

  • Loading...

More Telugu News