2024 అసెంబ్లీ ఎన్నికల్లో జనసేన, వామపక్షాలతో కలిసి పోటీ: టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యుడు షరీఫ్

30-12-2021 Thu 08:43
  • తూర్పుతాళ్లులో ‘టీడీపీ గౌరవ సభ’
  • రాష్ట్రంలోని పరిస్థితులు బీహార్‌ను తలపిస్తున్నాయని వ్యాఖ్య  
  • వైసీపీ పాలన అసమర్థంగా, అరాచకంగా ఉందన్న షరీఫ్   
fight with janasena and communist parties said tdp leader shariff mohammed ahmed
వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీని ఓడించేందుకు జనసేన, వామపక్షాలతో కలిసి పోటీ చేస్తామని టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యుడు, శాసనమండలి మాజీ చైర్మన్ మహ్మద్ అహ్మద్ షరీఫ్ తెలిపారు. పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురం మండలం తూర్పుతాళ్లులో నిన్న నిర్వహించిన ‘టీడీపీ గౌరవ సభ’ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు.

రాష్ట్రంలోని పరిస్థితులు బీహార్‌ను తలపిస్తున్నాయని అన్నారు. ప్రభుత్వమే వీటిని ప్రోత్సహిస్తోందని మండిపడ్డారు. వైసీపీ ప్రభుత్వం అరాచకంగా, అసమర్థంగా వ్యవహరిస్తోందన్నారు. భద్రత, ప్రశాంత పాలనకు టీడీపీని ఆదరించాలని, వచ్చే ఎన్నికల్లో పార్టీని గెలిపించాలని కోరారు.